జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో, 60 నగరాల్లో 200 సన్నాహక సమావేశాలు నిర్వహించారని పవన్ వెల్లడించారు. ఈ సన్నాహక సభల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 1.5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ఇదే నిజమైన నిదర్శనమన్నారు పవన్ కల్యాణ్‌. 


వసుధైక కుటుంబం అనే స్ఫూర్తిని...జీ20 సదస్సు చాటుతుందని పవన్ కల్యాణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక జీ20 సదస్సు ద్వారా తీసుకునే సానుకూల నిర్ణయాలు, ఇండియాతో పాటు యావత్ ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. జీ20 సదస్సు వేళ జనసేన పార్టీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీకి, ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.