పోలవరం ప్రాజెక్టుకుపై కేంద్రం మరో శుభవార్త చెప్పింది. 12,911.15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడానికి ఓకే చెప్పింది. విభాగాల వారీగా పెట్టే పరిమితులను తొలగించింది. ఇప్పుడు ఇచ్చిన నిధులు ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు. 


2013–14 ధరల ప్రకారం చూస్తే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే అవుతుంది. కానీ కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పునారావాసానికే భారీ ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది. అందుకే తాజా రేట్ల ప్రకారమే నిధులు ఇవ్వాలని కోరుతూ వచ్చింది. అలా చేయకుంటే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యపడదని కూడా రాష్ట్ర ప్రభుత్వాధికారులు కేంద్రానికి నివేదకలు ఇచ్చారు. 


ఈ మేరకు కేంద్ర జల సంఘానికి చెందిన టీఏసీ కూడా 2017-18 ధరల ప్రకారం 55,656.87 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనాలు కూడా వేసింది. అయితే కేంద్రం మాత్రం దీనిపై మెలికె వేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖర్చు పెడుతూ వెళ్లింది. దీంతో కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ప్రాజెక్టు పనుల వేగం మందగించింది. ఇప్పటి వరకు  చేసిన వ్యయాన్ని కూడా రీయింబర్స్ చేయాలని కోరింది. అయితే రీయింబర్స్‌మెంట్‌ విభాగాల వారీగా కూకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఇవ్వాలి కోరుతూ వచ్చింది ప్రభుత్వం. 


వీటన్నింటిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు డ్యాం 41.15 మీటర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు నిధులు విడుదలకు ఓకే చెప్పింది. దీనికి 10,911.15 కోట్లు ఖర్చు అవుతుందని గతంలోనే ఏపీ ప్రతిపాదించింది. తర్వాత మేలో వాటిని రివైజ్ చేసి డయాఫ్రం వాల్‌ రిపేర్, ప్రధాన డ్యాంలో పడ్డ గుంతలు పూడ్చే నిధులతో కలిపి రూ.16,952.07 కోట్లు అవసరమని లెక్కలు చెప్పారు. కేంద్రం మాత్రం పాత అంచనాలతోనే ప్రాజెక్టు కోసం రూ.10,911.15 కోట్లు, డయాఫ్రం వాల్‌ ఇతర పనులకు రూ.2,000 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. మొత్తం కలిపి రూ.12,911.15 కోట్లకు ఆర్థికశాఖ వ్యయ నియంత్రణ విభాగం ఆమోదించింది. మార్చి 4, 5 తేదీల్లో కేంద్రజల వనరుల మంత్రి షెకావత్‌, ఇతర అధికారులు, నిపుణులు ప్రాజెక్టును సందర్శించారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్‌పీ, ఎన్‌హెచ్‌పీసీ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నిపుణుల బృందం పరిశీలించి కేంద్ర జలశక్తి శాఖకు నివేదికలు సమర్పించాయి.


ఈ నిధులపై పరిమితి విధించబోమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ఈ అదనపు నిధులు ఏ విభాగం పరిధిలోనైనా ఖర్చు చేసుకునేందుకు వీలు కల్పించింది.