Dwakra Mahila Sangam In AP: వైసీపీ నాలుగేళ్ల పాలనలో డ్వాకా మహిళలకు జరిగిన అన్యాయంపై తెలుగు మహిళలు ఛార్జ్ షీట్ ను రిలీజ్ చేశారు. డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిదేనని వారు మండిపడ్డారు.


తెలుగు మహిళల ఛార్జ్ షీట్...
 సీఎం జగన్ పాలనలో డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయం గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో డ్వాకా మహిళలకు జరిగిన అన్యాయంపై తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఛార్జిషీట్ ను  తెలుగునాడు అంగన్ వాడి, డ్వాక్రా సాధికార కమిటీ సభ్యులు విడుదల చేశారు. అనంతరం తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ.. గూగుల్ లోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని కొడితే బటన్ సీఎం, ఫేక్ సీఎం, క్రిమినల్ సీఎం అని వచ్చే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఇంతగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతోందని, అధికారంలోకి రాక మునుపు జగన్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.


అక్కచెల్లెమ్మలకు, డ్వాక్రా మహిళలకు అధికారంలోకి వచ్చిన మొట్టమదటి సంతకం డ్వాక్రా రుణ మాఫీపై చేస్తానని చెప్పి మహిళలను వంచించారని వ్యాఖ్యానించారు.  అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు సంవత్సరాలలో డ్వాక్రా మహిళల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు ఏంటని ఆమె ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఒక కోటి 14 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, వారి సంక్షేమానికి తూట్లు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను తన మానసపుత్రికలుగా చూశారని, నిరంతరం వారి అభివృద్ధికి పనిచేస్తూ, ప్రతి సంక్షేమ పథకాలలో ప్రతి ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వాములు చేసిన ఘనత చంద్రబాబు సొంతం అన్నారు. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలను ప్రభుత్వ సభలు, సమావేశాలకు జనాలను తరలించే సంఘాలుగా మార్చారని, ఈ విషయంపై ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని చెప్పారు.


ప్రపంచానికి డ్వాక్రా మహిళలను పరిచయం చేసింది చంద్రబాబు...
చంద్రబాబు డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపారని, డ్వాక్రా మహిళల్ని బిల్ క్లింటన్, బిల్ గెట్స్ లాంటి నాయకుల పక్కన కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబుదని అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. డ్వాక్రా మహిళల్ని చంద్రబాబు గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారుచేశారని, జగన్ డ్వాక్రా మహిళలను కేవలం వారి పల్లకీ మోసేందుకు మాత్రమే పరిమితం చేశారంటూ మండిపడ్డారు. ప్రభుత్వాలు నిర్వహించే సమావేశాలకు వచ్చే సభ్యులుగా మాత్రమే డ్వాక్రా మహిళల్ని చూస్తున్నారని, జగన్ ఆసరా ద్వారా కోటి మందికి లబ్ది చేకూరుస్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోక వచ్చాక ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని వివరించారు. ఇంతవరకు ఎంత రుణమాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 4 సంవత్సరాల కాలంలో మూడవ విడత ఇవ్వాల్సిన రుణ మాఫీ సమయంలో ఖాళీ చెక్కులిచ్చారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా సభ్యులు ప్రభుత్వ సభలు, సమావేశాలకు రాకపోతే మీ సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదరిస్తున్నారని, ఏబీఎం ల ద్వారా ప్రభుత్వ సభలు, సమావేశాల్లో బలవంతంగా కూర్చోబెడుతున్నారని ఆరోపించారు.