Nandamuri Balakrishna Comments: విజయవాడ విలయానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, ఇవి ప్రభుత్వం సృష్టించిన వరదలేనని ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. వైసీపీ అధినేత జగన్ కూడా ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు కౌంటర్ గా టీడీపీ.. జగన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టింది. ఈ క్రమంలో వరదలపై తొలిసారి స్పందించారు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ. ఇవి ప్రభుత్వం సృష్టించిన వరదలా..? అని గట్టిగా నవ్వారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అన్నారు బాలయ్య.
పేర్లెందుకులే..!!
ప్రభుత్వం సృష్టించిన వరదలు అని కొంతమంది అంటున్నారని, వారి పేర్లు ఎందుకులే అని దాటవేశారు బాలయ్య. ప్రభుత్వం వరదల్ని సృష్టించింది అనడం హాస్యాస్పదం అన్నారు. వారిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. వారిని ఏమి అనాలో, ఏమి అనకూడదో మనకు తెలుసు కానీ.. అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక వరద సాయం ప్రకటించిన సినీ నటులు, ఇతరులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
హీరోలతో కలిసి విజయవాడకు బాలయ్య
బాలయ్య సహా సినీ నటులు చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరద సాయం ప్రకటించారు. ఈరోజు బాలయ్యతోపాటు హీరోలు జొన్నలగడ్డ సిద్ధు, విశ్వక్‌సేన్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. సీఎం చంద్రబాబుని నేరుగా కలసి సీఎం రిలీఫ్ ఫండ్ కి తమ డొనేషన్ అందజేయబోతున్నారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బాలకృష్ణ.. వరదలు, వరదలపై వచ్చిన విమర్శలు, వరద సాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50 లక్షలు.. మొత్తంగా కోటి రూపాయలు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ ఏపీ, తెలంగాణకు చెరో రూ. 15 లక్షలు.. మొత్తంగా రూ.30 లక్షలు ప్రకటించారు. విశ్వక్ సేన్ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు విరాళంగా ఇస్తానన్నారు, వరద విలయం ప్రారంభమైన వెంటనే విశ్వక్ సేన్ తన విరాళాన్ని ప్రకటించారు. ఆ విరాళాన్ని తామే స్వయంగా సీఎం చంద్రబాబుకి అందించేందుకు వారంతా ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు.
ప్రాంతాలు వేరైనా మనందరి తెలుగు భాష ఒక్కటేనని, ఒక ప్రాంతానికి ఆపద వస్తే మరో ప్రాంతం సాయం చేసే విధంగా కుటుంబంలాగా పనిచేశారని అన్నారు బాలకృష్ణ. గతంలో ఇలాంటి విపత్తుల సమయంలో అందరినీ ప్రభావితం చేసే విధంగా ఎన్టీఆర్ జోలె పట్టి మరీ అన్ని ప్రాంతాలు తిరిగేవారని గుర్తు చేశారు. నటీనటులు షూటింగ్ లతో బిజీగా ఉన్నా సరే తమ వంతు సాయం ప్రకటించారని, వారంతా తమ వీలు చూసుకుని స్వయంగా ఏపీకి వచ్చి తమ సాయం అందజేస్తారని చెప్పారు. విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా బాగా స్పందించిందని కితాబిచ్చారాయన. వరద సాయం చేస్తామన్న సినీ నటులకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.
Also Read: జగన్‌తో సెల్ఫీ, ఇదీ చాలా స్పెషల్ గురూ!
ఏపీ, తెలంగాణలో ఒకేసారి వరదలు రావడంతో రెండు రాష్ట్రాలకు సినీ నటులు భారీ విరాళాలు ప్రకటించారు. ఈ విరాళాలను వారే స్వయంగా వచ్చి ప్రభుత్వ అధినేతల్ని కలసి అందిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా నేరుగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిని కలసి తన విరాళాన్ని అందించారు. మిగతా నటీనటులు కూడా స్వయంగా తామే వచ్చి విరాళాల చెక్కులు ఇస్తున్నారు.