Prakasam Barrage News: విజయవాడలో క్రిష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన భారీ బోట్లను తొలగించేందుకు నిపుణులతో కూడిన టీమ్ శ్రమిస్తోంది. దాదాపు పది మందితో కూడిన డైవింగ్ టీమ్ నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేస్తున్నారు. ఆ భారీ పడవలను యథాతథంగా తొలగించేందుకు సాధ్యపడనందునే ముక్కలుగా బోట్లను కోసి తీయాలని భావించారు. కానీ, బోట్లు చాలా దృఢంగా ఉండటంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్య పడలేదు. ఇక చేసేది లేక అధికారులు ఆ బోట్లను ముక్కలు చేసే పనిని వేగవంతం చేశారు.

Continues below advertisement


సెప్టెంబరు 11 మధ్యాహ్నం నుంచి పడవలను కోసే పనిని ప్రారంభించగా ఆ పనిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. నేటి మధ్యాహ్నం వరకూ ఓ పడవను రెండుగా కోసే పనులు పూర్తి అవుతాయని అంటున్నారు. ఆ తర్వాత ఆ ముక్కలను భారీ క్రేన్లతో బయటకు వెలికి తీసి.. మరో రెండు పడవల కోతను మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. భారీ పడవలు ధృడంగా ఉండటం వల్ల అవి తీసేందుకు చాలా ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. తొలి రోజున దాదాపు 50 టన్నుల చొప్పున మొత్తం 100 టన్నుల బరువు ఎత్తే రెండు భారీ క్రేన్లను ప్రకాశం బ్యారేజీ పైకి తీసుకొచ్చి పడవలను ఎత్తే ప్రయత్నం చేసినా భారీ పడవలు అస్సలు కదల్లేదు. 


బోటు ఖరీదు రూ.50 లక్షలు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న మూడు బోట్లలో ఒక్క పడవ ఖరీదు రూ.50 లక్షల దాకా ఉంటదని అధికారులు చెబుతున్నారు. ఇంత విలువైన పడవలు తమవేనని ఎవ్వరూ ముందుకు రాకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఈ బోట్లను తొలగించేందుకు, ధ్వంసమైన కౌంటర్‌ వెయిట్లను ఇప్పటికే ప్రభుత్వం రూ.కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అదే కాక, ఇప్పుడు భారీ పడవలు కత్తిరించడం, నిపుణుల టీమ్‌ను రంగంలోకి దింపడం కోసం కూడా భారీగానే ప్రభుత్వం ఖర్చు పెడుతోంది.


వైసీపీ వారి బోట్లే అని టీడీపీ ఆరోపణలు
ప్రకాశం బ్యారేజీ వద్దకు వేగంగా కొట్టుకొచ్చి గేట్లను బలంగా ఢీకొట్టిన వ్యవహారంలో టీడీపీ నేతలు వైసీపీని నిందిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కావాలని బ్యారేజీ ధ్వంసానికి పథక రచన చేశారని సీఎం చంద్రబాబు కూడా ఆరోపిస్తున్నారు. ఆ పడవలకు వైసీపీ రంగులు వేసి ఉండడం సహా మరెన్నో ఆధారాలను కూడా టీడీపీ నేతలు బయట పెడుతున్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.