దెబ్బలు కనిపించకుండా ఐదుగురు వ్యక్తులు కొట్టారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఇన్‌ఛార్జ్ దారపనేని నరేంద్ర జడ్జికి ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి అరెస్టు చేసిన నరేంద్రను ఇవాళ జడ్జి ముందుకు తీసుకెళ్లారు ఏపీసీఐడీ అధికారులు. 24 గంటల పాటు చిత్రహింసలు పెట్టారని, ఐదుగురు వ్యక్తులు కొట్టారని జడ్జి దృష్టికి నరేంద్ర తీసుకొచ్చారు.
నరేంద్ర ఫిర్యాదుపై స్పందించిన న్యాయమూర్తి.. నరేంద్రకు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయాలని ఆదేశించారు. నివేదికను త్వరగా ఇవ్వాలని సూచించారు. వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా రిమాండ్‌పై ఆలోచిస్తామన్నారు. జడ్జి ఆదేశాలతో నరేంద్రను జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించారు ఏపీ సీఐడీ అధికారులు.
గన్నవరం విమానాశ్రయంలో ఇటీవలే వెలుగు చూసిన బంగారం స్మగ్లింగ్ కేసులో తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు సోషల్ మీడియాలో షేర్‌లు చేసినందుకు నరేంద్రను ఏపీసీఐడీ అధికారులు బుధవారం సాయంత్ర అరెస్టు చేశారు. ఇదే కేసులో సీనియర్ జర్నలిస్ట్ అంకంబాబును గతంలో అరెస్టు చేశారు. ఈ అంశంపైనే నరేంద్రను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంకంబాబుకు ఆ పోస్టు ఎవరు పంపించాలో చెప్పాలన్నారని తెలుస్తోంంది.
ఈ అరెస్టుపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రను సిఐడి పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సిఐడి పోలీసుల తీరుమారడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును కోర్టు తప్పు పట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో పని చేసే వారిని అరెస్టు చేసి భయపెట్టాలనే సిఎం జగన్ వైఖరిని ఖండించారు.
ఇలాంటి కేసుల్లో 41 A నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెపుతున్నా... పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి పూట చేస్తున్న అరెస్టులు కోర్టులో నిలబడవని చంద్రబాబు అన్నారు. అక్రమ అరెస్టులపై పోలీసులను కోర్టు షోకాజ్ అడిగినా వారి తీరు మారకపోవడాన్ని తప్పు పట్టారు. దీనికి అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వెంటనే పార్టీ నేత నరేంద్రను విడుదల చెయ్యాలని పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.