మ‌రో 18,19 నెలల్లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. ఇందుకు కార్య‌క‌ర్త‌లు సిద్దం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం, సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడారు. వ్య‌క్తిగ‌తం వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 


నియోజకవర్గంలోని ముఖ్యమైన కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమ‌ని తెలిపారు సీఎం జగన్. ఇక మరో 18 –19 నెలల్లో మళ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని... ఈరోజు నుంచి కూడా ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నామ‌ని, ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్తున్నారు, ఈ మూడేళ్ల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం, ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నామని చెప్పారు. ఆ మేలు జరిగిందా? లేదా? అనే విచారణ చేస్తున్నామ‌ని అన్నారు. వారి ఆశీస్సులు తీసుకుంటున్నామ‌ని,ఇందులో మీ పాత్ర‌కీల‌క‌మ‌ని జ‌గ‌న్ అన్నారు. 


ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే.. వాటిని రిపేరు చేస్తున్నాని వివ‌రించారు సీఎం జగన్. ప్రభుత్వంలో ఉన్న మనం అంతా.. గ్రామస్థాయిల్లో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం కాబ‌ట్టి, మనం అంతా కలిసికట్టుగా ఒక్కటి కావాలి, అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తామ‌ని వివ‌రించారు. అలాగే ప్రతి సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు అత్యంత ముఖ్యమైన, ప్రాధాన్యతా పనుల కోసం కేటాయిస్తున్నాట్లు చెప్పారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామంలో 2 రోజులపాటు కచ్చితంగా ఎమ్మెల్యే గడపుతున్నారని...కాబ‌ట్టి సీఎంగా తాను అందుబాటులో ఉండకపోవచ్చన్నారు. అలా అందరికీ అందుబాటులో ఉండటం సాధ్యం కాదు కాబట్టే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకూ అందుబాటులో ఉండాలని సూచించారు.  


ఎమ్మెల్యేలు మాత్రం ప్రతిగ్రామంలో తిరగాల్సిందేన‌ని జగన్ స్ప‌ష్టం చేశారు. ఈ మధ్యలో వీలైనప్పుడు తాను ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 100 మంది కార్యకర్తలను కలుస్తున్నానన్నారు. ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో రూ.1050కోట్లు లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో వేయడం జరిగిందని ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించే బాధ్యత తీసుకోవాల‌ని సూచించారు.


ఎన్నిక‌ల‌కు ప్లాన్స్ ఎంటి...


వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్న వేళ ఎలాంటి ప్లానింగ్ ఉండాల‌నే దానిపై కూడా సీఎం జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల నుంచి అభిప్రాయాల‌ు అడిగి తెలుసుకున్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం వారి అనుభ‌వాల‌పై ఆరా తీశారు. ఎన్నిక‌ల‌కు వెళుతున్న వేళ కేవ‌లం సంక్షేమం కేంద్రంగా అందిస్తున్న ప‌థకాలు వాటి ప్ర‌భావంపై కూడా అభిప్రాయాల‌ను అడిగార‌ని కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు.