Vijayawada Floods: విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు కాలువ గండి పడిన చోటును మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. అక్కడ విపరీతంగా బురద ఉన్నప్పటికీ గండి పడిన తీరును పరిశీలించారు. ప్రస్తుతం ఆ గండిని పూడ్చే పనులు జరుగుతున్నాయని లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం ఆ పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి ఆదేశాలతో వచ్చినట్లు వివరించారు. ఈ పనుల పరిశీలనలో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. 




అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా పని చేసి మొదటి గండి పూడ్చారని.. గత ఐదేళ్లలో కనీస మరమ్మతు పనులు కూడా చెయ్యకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని అధికారులు లోకేశ్ కు వివరించారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేసినట్లు లోకేశ్ చెప్పారు. విజయవాడ వరద బాధితులకు అధికార యంత్రాంగం, టీడీపీ నేతల ద్వారా సత్వర సాయం అందేలా ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వరద తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం అయ్యాయని అన్నారు.


చంద్రబాబుతో డ్రోన్ ద్వారా సమీక్ష


అంతకుముందు బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లోకేశ్ పర్యవేక్షించారు. అప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతమ‌య్యేలా అధికారుల‌తో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు వివరించినట్లు లోకేశ్ చెప్పారు. ప్రధానంగా 2, 3 వంతెనల వద్ద పడిన గండ్ల నుంచే వరద నీరు అజిత్ సింగ్ నగర్లోకి ప్రవేశిస్తున్నందున వీటిని పూడ్చి వేయ‌డ‌మే ల‌క్ష్యంగా మొత్తం యంత్రాంగం అంతా ప‌నిచేస్తోంద‌ని లోకేశ్ తెలిపారు.