Andhra Pradesh News: మంత్రి అంబటి రాంబాబు అల్లుడు గౌతమ్ మరో వీడియో విడుదల చేశారు. ఈసారి మరిన్ని వివరాలు చెబుతూనే... తన పిల్లలను దూరం చేసి క్షోభకు గురి చేశారని ఆరోపించారు. తన తండ్రి చివరి కోరిక కూడా తీర్చకుండా బాధను మిగిల్చారని భావోద్వేగానికి గురయ్యారు.
మంత్రి అంబటి రాంబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు అల్లుడు గౌతమ్. తాజాగా విడుదల చేసిన వీడియోలో మరిన్ని ఆరోపణలు చేశారు. అసలు తండ్రీ, పిల్లలను వేరు చేసి వేడుక చూసింది రాంబాబే అన్నారు. ఇప్పుడు తనేదో వారిని పోషిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఆ అవసరం వారికి లేదని... తాను ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగానే ఉన్నానని... పోషించుకునే సత్తా ఉందన్నారు. రేపే మీడియా సమక్షంలో ఆయన ఇంటికి వెళ్తే పిల్లలను అప్పగించే దమ్ము ఉందా అని సవాల్ చేశారు. లేదనుకుంటే వాళ్లే వచ్చి తన ఇంట్లో దింపి వెళ్లగలరా అని ప్రశ్నించారు.
22 మార్చి 2023లో తన తండ్రి చనిపోయారని... అంత కంటే ముందు చాలా రోజుల నుంచి మనవళ్లను చూడాలని పరితపించిపోయారని గుర్తు చేశారు గౌతమ్. ఈ విషయాన్ని రాంబాబుకు తెలియజేశామని అయినా పిల్లల్ని పంపించలేదని అన్నారు. నోటి మాట రాకపోయినా తన తండ్రి మనవళ్లను చూడాలని వీడియో రికార్డు చేసి పంపినా వాళ్లు కనీసం స్పందించలేదన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను చూపించారు.
నాలుగేళ్లుగా న్యాయం చేస్తారన్న కారణంతో మౌనంగా ఉండాల్సి వచ్చిందన్న గౌతమ్ ఇప్పుడు తేల్చుకునేందుకే బయటకు వచ్చానన్నారు. కోర్టులో కూడా పోరాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. మనవళ్లను చూడకుండా కన్ను మూసిన తన తండ్రి బాధ, ఆయన ఆఖరి కోరిక తేర్చలేని తన వ్యథను తీర్చేది ఎవరని ప్రశ్నించారు. తామంతా ఎంత కుంగిపోయి ఉంటామో ఎవరికైనా తెలుసా అని అన్నారు. ఇప్పుడు రాంబాబు ఫ్యామిలీ గురించి మాట్లాడితే దేనికైనా సిద్ధమైనట్టు అందరిపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు.