AP EAPCET 2024 Halltickets: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్-2024 (AP EAPCET) పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేనిదే పరీక్షకు అనుమతించరు. దీనితోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 16 నుండి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఈ పరీ ద్వారా 2024-25 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు
AP EAPCET 2024 Halltickets Download
ఆలస్యరుసుముతో 12 వరకు దరఖాస్తుకు అవకాశం..
ఏపీ ఎప్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యరుసుములేకుండా ఇప్పటికే ముగిసింది. ఇక రూ.500, రూ.1000 ఆలస్యరుసుముతో కూడా దరఖాస్తు గడువు ముగిసింది. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేకపోయినవారు రూ.5000 ఆలస్యరుసుముతో మే 10 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో మే 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
ఏపీ ఎప్‌సెట్ దరఖాస్తు వివరాల సవరణ కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
➥ ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు.
➥ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు.
➥ మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
➥ ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి.
➥ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ఇందులో బోటనీ నుంచి 40 ప్రశ్నలు, జువాలజీ నుంచి 40 ప్రశ్నలు, ఫిజిక్స్ 40 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఉంటాయి.
➥ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 మార్కులుగా నిర్ణయించారు.
ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీలు..
అగ్రికల్చర్ & ఫార్మా కోర్సులకు: 16.05.2024 - 17.05.2024
ఇంజినీరింగ్ విభాగాలకు: 18.05.2024 - 23.05.2024.