YS Jagan Speech AT Police Commemoration Day: హోంగార్డుల భర్తీలో రిజర్వేషన్ కల్పించడానికి శ్రీకారం చుడుతున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం పోలీస్ శాఖలోనే 16వేల మహిళా పోలీసులను నియమించినట్లు చెప్పారు. దిశ యాప్, దిశా పోలీస్టే స్టేషన్లు, ప్రాసిక్యూటర్లను ప్రతి నియమించామని చెప్పిన సీఎం జగన్.. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలని సందేశం ఇచ్చారు. ఇప్పటిదాకా 1.33 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, పోలీస్‌ శాఖలోనే 16వేల మంది మహిళా పోలీసులను నియమించామని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 


కచ్చితంగా వీక్లీ ఆఫ్స్ అమలు చేసేందుకు నిర్ణయం 
పోలీసులకు త్వరలోనే వీక్లీ ఆఫ్ లు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. గత సంవత్సర కాలంలో ఏపీ నుంచి విధి నిర్వహణలో పదకొండు మంది పోలీసులు అమరులయ్యారని ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, 6,511 పోలీస్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయితే వారికి వీక్లీ ఆఫ్ లు ప్రారంభిస్తామని చెప్పారు. పోలీసుల సేవలు ప్రజలకు ఎంతో అవసరమని, ఉద్యోగాల భర్తీతో వీక్లీ ఆఫ్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు సీఎం జగన్.







రాష్ట్రంలో కీలకమైన హోం శాఖకు మహిళలు, దళితులను మంత్రులుగా నియమించి వారికి ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందన్నారు. పోలీస్ సిబ్బంది సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు నోటిఫికేషన్ జారీ వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పోలీసుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం జగన్‌ అన్నారు. సిబ్బంది కొరత లేకపోతే వీక్లీ ఆఫ్ ఇప్పటికే అమలు చేసే వారిమన్నారు.


త్వరలోనే ఉద్యోగాల భర్తీ
ఆరువేలకుపైగా ఉద్యోగాల్లో ఆర్‌ఎస్‌ఐ ఉద్యోగాలు 96 ఉంటే... ఎస్‌ఐ సివిల్ ఉద్యోగాలు 315 ఉన్నాయి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2520, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 3580 ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వ విడుదల చేసిన జీవోలో పేర్కొంది. జులైలోనే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పోలీస్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఖాళీలు, రాష్ట్ర అవసరాలు, కొత్త జిల్లాల తర్వాత అవసరమైన అదనపు పోస్టుల భర్తీపై చర్చించారు. ఖాళీలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ సమాచారం సేకరించి రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీనికే ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మిగతా పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తారు.