Rains in Telangana AP: ఉత్తర, దక్షిణ అండమాన్ సముద్రంలో గురువారం అల్పపీడం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడనం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి అక్టోబర్ 22న వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ మరుసటిరోజు మరింత తీవ్రరూపం దాల్చి అక్టోబర్ 24న వాయుగుండం తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అదేరోజు ఒడిశా తీరాన్ని, అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు.
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ఏర్పడటంతో మరో మూడు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశాయి అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు. ఏపీకి సిత్రాంగ్ తుపాను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సిత్రాంగ్ తుఫానుకి ఎటువంటి సంబంధం ఉండదని, అయితే తుపాను కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు మాత్రం ఉంటాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని చెప్పారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో అక్టోబరు 23 వరకూ ఇలాగే వాతావరణ పరిస్థితి ఉండొచ్చని తాజా వెదర్ బులెటిన్ లో తెలిపారు. వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తూర్పు దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నిజామాబాద్, వికారాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మోస్తను నుంచి భారీ వర్షం కురవనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
సిత్రాంగ్ తుపాను ముప్పు తప్పినప్పటికీ, ఏపీపై కాస్త ప్రభావం చూపుతోంది. అల్పపీడనం ఏర్పడటంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నేడు అక్కడక్కడ వర్షాలున్నాయి. అక్టోబర్ 23 వరకు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలున్నాయి. దాంతో మూడు రోజులవరకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 55 కిలోమీటర్లు దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అక్టోబర్ 20న బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వర్షాలు పడతాయి. కడప జిల్లాలోని పలు భాగాలు, అనంతపురం జిల్లాలోని పలు భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పలు చోట్ల (ముఖ్యంగా మదనపల్లి ప్రాంతం) వర్షాలు పడతాయి.