గతంలో ఎప్పుడూ లేని సంస్కరణలు అమలు చేస్తూనే ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నామని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవో 21 వ రాష్ట్ర మహా సభల్లో ప్రారంభోపాన్యాసం చేశారు జగన్. ఏపీ ఎన్జీవో సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల బాగు కోరే ప్రభుత్వంగా జీపీఎస్ తీసుకొచ్చామని గుర్తు చేశారు. రేపో ఎల్లుండో దీనిపై ఆర్డినెన్స్ వస్తుందని తెలిపారు.
ఉద్యోగుల బాగు కోసమే జీపీఎస్
నిజాయితీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామన్నారు సీఎం జగన్. దేశంలోని రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తపన ఉన్న వ్యక్తిగా ఉద్యోగుల బాధను తీర్చానని వివరించారు. అందుకే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చామని ఇది దేశానికే ఆదర్శంగా మారుతుందన్నారు.
వ్యవస్థలను బాగు చేస్తున్నాం
గత ప్రభుత్వం వ్వవస్థలను నాశనం చేసిందని వాటిని గాడిలో పెడుతూనే పాలన సాగిస్తున్నామన్నారు సీఎం. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అన్నింటినీ గత పాలకులు నాశనం చేశారన్నారు. ఏడు నియోజకవర్గాలకు ఒక కలెక్టర్, ఎస్పీ ఉండేలా కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వం యంత్రాంగం విస్తరిస్తోందని పేర్కొన్నారు. వాటితో గత పాలకులు పక్కన పడేసిన సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
మొదటి వారంలోనే జీతాలు
గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని విమర్శించారు సీఎం జగన్. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామి వివరించారు. గత ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు ఉద్యోగులను మభ్యపెట్టిందని వరాలు ప్రకటించిందన్నారు. తాము అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు పెంచామన్నారు. నెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు ఇస్తూ అండగా నిలుస్తున్నామని వివరించారు. వాలంటీర్, సచివాలయాల ఏర్పాటుతో ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించామని తెలిపారు. దీంతోపాటు దళారీ వ్యవస్థకు చెక్ పెట్టగలిగామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలపై మమకారం ఉన్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు.
ప్రజాప్రభుత్వం మాది
కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇచ్చామని తెలిపిన జగన్... 10వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని వివరించారు. కారుణ్య నియామాకాల్లో పారదర్శకత పాటిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తున్న ప్రజా ప్రభుత్వం తమదన్నారు. తమకు ప్రజలకు మధ్య ఉద్యోగులే వారధులని అభిప్రాయపడ్డారు. అలాంటి వారి భవిష్యత్ ప్రభుత్వానిదేనన్నారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా అందరికంటే మిన్నగా ఉన్నామని తెలిపారు.
దసరాకు డీఏ
పెండింగ్‌లో ఉన్న డీఏను దసరా కానుకగా అందిస్తామన్నారు సీఎం జగన్. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. మొక్కుబడిగా కొన్ని ఉద్యోగాలు విదిల్చారని ఆరోపించారు. తానంటే చంద్రబాబుకు ఆయనకు మద్దతు తెలిపే వర్గానికి కడుపు మంట అన్నారు. ఉద్యోగులకు చంద్రబాబు ఏమైనా మంచి చేయగలరా అని ఉద్యోగులు ఆలోచించుకోవాలని అని పిలుపునిచ్చారు. ఉద్యోగుల్లో కొందరే మంచివాళ్లను మిగతా వాళ్లంతా లంచగొండులుగా చంద్రబాబు వక్రీకరించారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.
Also Read: ఏపీకి మరో వందే భారత్, ఈ సారి రూట్ ఎక్కడికంటే?
Also Read: పాడేరు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, బాధితులకు మంత్రి గుడివాడ పరామర్శ