Vande bharat Express: ఏపీకి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుందా అంటే? అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం మార్గంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరింది. దీంతో విశాఖ-తిరుపతి మధ్య నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వాల్తేరు రైల్వే అధికారులు స్పందించారు. వందేభారత్ రైలు నడపడంపై తమకు ఎటువంటి సమాచారం తమకు అందలేదని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. 


విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య ఇప్పటికే వందేభారత్‌ నడుస్తోంది. ఇది తరచూ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. పలు సార్లు రద్దైంది. తరచూ ఇలా జరుగుతుండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రేక్‌ను చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. కానీ ఎక్కువ శాతం మంది విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. 


ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడోది హైదరాబాద్-బెంగళూరు మధ్య మూడో వందే‌భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. విశాఖ-తిరుపతి మధ్య కొత్త రైలు వస్తే ఈ సంఖ్య నాలుగుకు చేరుతుంది. ఇప్పటికే  హైదరాబాద్-బెంగళూరు మార్గానికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు కాగా, రైలు ట్రయిల్ రన్ కూడా పూర్తయింది. ఈ ట్రైన్ ఆగష్టు 15న ప్రారంభమవ్వాల్సి ఉండగా వాయిదా పడింది. 


ఈ నెల 31న వందేభారత్ రైలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అలాగే ధరలు కూడా ఖరారు చేసినట్లు సమాచారం. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు 618 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడున్నర గంటల్లోనే చేరుకుంటుంది. సాధారణ ట్రైన్‌తో పోలిస్తే ప్రయాణ సమయం నాలుగున్నర గంటలు తగ్గనుంది. ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, షాద్‌నగర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగనుందని తెలుస్తోంది.  


ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 1545గా, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 2,050గా ఉంటుందని చెబుతున్నారు. అయితే దీనిపై రైల్వే అధికారుల నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే  రైలు ప్రారంభోత్సవంపై కూడా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది.