అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. జూనియర్ కాలేజీ కాంపౌండ్‌ వాల్ ధ్వంసం చేశారని తాడిపత్రి మున్సిలప్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరో 13 మందిపై కూడా కేసు రిజిస్టర్ చేశశారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 


రాష్ట్రంలో నిత్యం రాజకీయంతో కాకపుట్టించే ప్రాంతాల్లో తాడిపత్రి ఒకటి. ప్రతి అంశం కూడా రాజకీయంతోనే ముడిపడి ఉంటుంది. అధికార ప్రతిపక్షాల మధ్య రోజూ ఏదో ఒక అంశంపై వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం కాలేజీ చుట్టూ ఏర్పాటు చేస్తున్న ప్రవహరీగోడ ఇరు పక్షాల మధ్య వార్‌కు కేంద్రబిందువైంది. 


జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ప్రహరీ నిర్మిస్తున్నారు. దీని కోసం తవ్విన పిల్లర్ల గుంతలన దుండగులు పూడ్చేశారు. ఇది జేసీ వర్గీయుల పనే అంటూ స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు అక్కడకు వచ్చి ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 


రోడ్డు విస్తరణ ఉన్న స్థలంలో ప్రహరీ నిర్మాణం చేయడంపై జేసీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది కేవలం 40 అడుగుల రోడ్డు విస్తరణ ఉందని ఎమ్మెల్యే అనుచరులు వాదిస్తున్నారు. 2022 మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం కాలేజీ నుంచి ఈద్‌గా వరకు 60 అడుగుల రోడ్ ఉందని ప్రభాకర్‌రెడ్డి మ్యాప్‌ చూపిస్తున్నారు. ఆ మేరకు స్థలాన్ని విడిచి పెట్టి ప్రహరీ నిర్మించాలని సూచిస్తున్నారు. రేపు రోడ్డు విస్తరణ చేపడితే గోడను కూల్చేయాల్సి ఉంటుందని అంటున్నారు. 


ఓవైపు జేసీ అనుచరులు, మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు ఒకేచోటుకు రావడం పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. జేసి ఇంటికి వెళ్ళే అన్ని దారులు మూసేశారు. ముగ్గురు సీఐలు, ఏడు మంది ఎస్‌ఐలు, భారీగా స్పెషల్ పార్టీ పోలీస్ బలగాలతో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 


ప్రస్తుతం పోలీస్ సెక్యూరిటీ మధ్యే కాలేజీ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరుగుతోంది. ఒక అడిషనల్ ఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి, ఇద్దరు  డిఎస్పీ లు, 7 మంది సీఐ లు,15 ఎస్ ఐ లు, 500 స్పెషల్ పార్టీ సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జెసి ఇంటిని, పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. జెసి ఇంటి వద్ద కు టిడిపి కార్యకర్తలను ,జెసి అనుచరులను ఎవరినీ అటుగా రాణించడం లేదు. 


మరోవైపు గుంతలు పూడ్చడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ కాంపౌండ్ వాల్‌ నిర్మించే కాంట్రాక్టర్ గురుశంకర్‌ ఫిర్యాదు చేశారు. జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వాల్‌కి చెందిన 53 పిల్లర్లు డామేజ్ చేశారంటూ వైసిపి నాయకుడు, కాంట్రాక్టర్‌ గురు శంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఈ కాలేజీ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి కావాలనే అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని... చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవిస్తున్నారని వివరించారు. అక్కడ పడేసిన మద్యం బాటిళ్లను అమ్ముకొని డబ్బులు చేసుకోవడానికే ప్రహరీ గోడను అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన అనుచరులతో ఆ మద్యం బాటిళ్లను ఏరించి అమ్ముకుంటున్నారని విమర్శించారు.