టిడిపి రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ దారపనేని నరేంద్రను ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో ఉన్న టైంలో బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆయన్ని అరెస్టు చేశారు. దీంతో గుంటూరు జిల్లా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. గన్నవరం విమానాశ్రయంలో జరిగన బంగారం అక్రమ రవాణా అంశంపైనే ఆయన్ని కూడా అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.  


తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సిఐడి పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సిఐడి పోలీసుల తీరుమారడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును కోర్టు తప్పు పట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో పని చేసే వారిని అరెస్టు చేసి భయపెట్టాలనే సిఎం జగన్ వైఖరిని ఖండించారు. 


ఇలాంటి కేసుల్లో 41 A నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెపుతున్నా... పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి పూట చేస్తున్న అరెస్టులు కోర్టులో నిలబడవని చంద్రబాబు అన్నారు. అక్రమ అరెస్టులపై పోలీసులను కోర్టు షోకాజ్ అడిగినా వారి తీరు మారకపోవడాన్ని తప్పు పట్టారు. దీనికి అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వెంటనే పార్టీ నేత నరేంద్రను విడుదల చెయ్యాలని పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.


విశాఖలో వైఎస్‌ఆర్‌సీపీ భూదందా సంగతిని పక్కదారి పట్టించేందుకే అరెస్టుల పర్వానికి తెరలేపారని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ఇది సుప్రీం ఆదేశాలను కాలరాయడం కాదా అని ప్రశ్నించారు. న్యాయస్థానాలు ఇస్తున్న ఆదేశాలను ఎలా తుంగలో తొక్కుతారని నిలదీశారు. వారానికొక టీడీపీ నేతను అదుపులోకి తీసుకుంటున్నారని... దీనికి సమాధానం చెప్పాల్సిన టైం వస్తుందన్నారు. 


మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర అరెస్టు వికృత చర్యగా అభివర్ణించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు. రేపంటూ ఒక రోజు ఉంటుందని సీఐడీ మర్చిపోవద్దని హెచ్చరించారు. తప్పుడు అరెస్టులకు పాల్పడిన ప్రతి అధికారిని చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. 


అధికార మదంతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ రెడ్డికి అక్రమ అరెస్ట్ లు తప్ప ఇంకేం తెలుసని ఎద్దేవా చేశారు. దారపునేని నరేంద్ర అరెస్టు ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమన్నారు. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని కోర్టులు తప్పు పట్టినా జగన్ రెడ్డికి బుద్ధి రాదేమో అన్నారు. దారపునేని నరేంద్ర ఒంటిపై చిన్న గాయమైనా, కస్టోడియల్ టార్చర్ చేసినట్లుగాని తెలిస్తే సీఐడీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 


సీఐడీ దుర్మార్గాలకు అంతు లేకుండా పోతోందన్నారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌. బందిపోటు దొంగల మాదిరి ఇంట్లో దూరి అరెస్టు చేస్తున్నారన్నారు. చట్టాలను ఉల్లంఘించి అరెస్టులు చేయాలని రాజారెడ్డి రాజ్యాంగం చెప్పిందా అని ప్రశ్నించారు. తక్షణమే నరేంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  


సీఐడీ సీఎం చేతిలో పకోడీ లా మారిందన్నారు టీడీపీ పొలిట్‌ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. దారపనేని నరేంద్ర అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులే దొంగల్లా మారి అర్థరాత్రుల్లు టీడీపీ నేతల ఇళ్లలో అరాచకాలు చేస్తున్నారన్నారు. జగన్ రెడ్డి సీఐడీ పోలీసుల్ని కేవలం కక్ష సాధింపు చర్యలకే వాడుతున్నారన్నారు.