Pawan Kalyan: రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఏదో సినిమాలో చెప్పినట్టు " లైట్ ఎక్కడో ఉంటుంది.. దాని స్విచ్చు ఇంకెక్కడో ఉంటుంది". నాయకుల స్పీచ్ గమనిస్తే యథాలాపంగా మాట్లాడిన మాటల వెనుక చాలా పెద్ద వ్యూహమే కనపడుతుంది. దానికి పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రసంగం బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడో ఆవు నెయ్యి కల్తీ దగ్గర మొదలైన రచ్చ పవన్ సనాతన ధర్మం కోసం తమిళంలో నిప్పులు చెరిగిన వరకు చేరుకుంది. సనాతన ధర్మ బోర్ట్ అనీ ధర్మ పరిరక్షణ అనీ పవన్ చాలా అంశాల మీదే మాట్లాడినా అసలు టార్గెట్ మాత్రం తమిళ రాజకీయ చిత్రమే అని అర్థమయిపోతుంది అంటున్నారు విశ్లేషకులు.
తమిళనాట రాజకీయ ప్రవేశానికి పవన్ దారి " సనాతన ధర్మ పోరాటం "
పవన్ కల్యాణ్ ఎంత తెలివైనవాడు అంటే అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న వారు కూడా ఆయన వ్యూహం ఏంటి అనేది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఆవేశమంతా ఏదో జగన్ మీదనో.. తిరుమలలోని ఆ కల్తి నెయ్యి వివాదం మీదనో అని భావించారు. కానీ ఆయన తన పార్టీని విస్తృతపరిచే దిశగా అడుగులు వేస్తున్న సంగతి స్పష్టమైపోయింది. ఫక్తు ద్రవిడ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే తమిళనాడులో ఆల్టర్నేటివ్ పొలిటికల్ థాట్‌ను బిల్డ్ చేసే పనిలో పవన్ ఉన్నట్టు తెలిసిపోతుంది.
తమిళనాడులో ఎంట్రీ ఇవ్వడం కోసం జాతీయ పార్టీలు చాలా ప్రయత్నించాయి. కానీ ఎంజీఆర్,కరుణానిధి కాలం నుంచి కూడా అది వర్కౌట్ కాలేదు. వారిద్దరనే కాదు తర్వాత కాలంలో జయలలిత, కరుణానిధి మధ్య ఎంతటి పాలిటికల్ వైరం నడిచినా బయట వ్యక్తులని వారు ఎంటర్ కానివ్వలేదు. మధ్యలో శరత్ కుమార్, విజయ కాంతుల లాంటి వాళ్ళు పార్టీలు పెట్టినా స్థానిక అంశాల మీదనే ఫోకస్ చేశారు. అంతే కానీ యాంటీ ద్రవిడియన్ థాట్ ఏ మాత్రం తమిళనాట ఎంకరేజ్ చేయలేదు. పోనీ వాళ్లందరి హవా ముగిసిపోయిన తర్వాత అంటే కరుణానిధి, జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో ఒక ఖాళీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకుందామనే జాతీయ పార్టీలకు స్టాలిన్ అడ్డుగా నిలబడ్డారు. శశికళ, అన్నామలైల ద్వారా తమిళనాట ప్రయోగం చేద్దామనుకున్న బీజేపీ బోల్తా పడింది.
లేటెస్ట్‌గా తమిళ దళపతి విజయ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. మరో రెండేళ్లలో జరిగే తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే, విజయ్ పార్టీ TVK మధ్యే ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విజయ్ కూడా తన సినిమాల ద్వారానో, అభిప్రాయాల ద్వారానో పూర్తిగా ద్రవిడ భావజాలాన్ని ప్రకటిస్తూ వచ్చారు. "మెర్సల్" సినిమాలో GST పై తను పేల్చిన డైలాగ్స్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే రేపాయి. ఆ టైంలో ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురైన ఘటనలు కథనాలుగా చూసాం.
మరోవైపు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం ఉన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టించాయో తెలిసిందే. సో భవిష్యత్తులో తమిళనాడులో పార్టీలు తమలో తాము ఎంతగా కొట్లాడుకున్నా మత ఆధారిత రాజకీయాలవైపు మొగ్గు చూపే ఛాన్స్ లేదు. దీనినే ఒక అవకాశంగా పవన్, ఆయన సన్నిహితులైన ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని సమాచారం.
తమిళనాడు - జాతీయ పార్టీలకు చాలా అవసరం
అసలు తమిళనాడు అనేది పొలిటికల్‌గా జాతీయ పార్టీలకు చాలా అవసరం. యూపీఏ కావొచ్చు, ఎన్డీఏ కావొచ్చు వాళ్లు ప్రవేశపెట్టే చాలా నిర్ణయాలకు తమిళ ఎంపీల మద్దతు అవసరం. 39 మంది ఎంపీలు ఉన్న తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏకతాటిపైనే ఉంటూ వచ్చింది. పార్టీలు వేరైనా రాష్ట్ర ప్రయోజనాలు అంటే మాత్రం ఏకమైపోతారు అక్కడి రాజకీయ నేతలు. అందుకే జాతీయ పార్టీల వ్యూహాలు అక్కడ పనిచేయడం లేదు. పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఇలా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినది ఏదైనా సరే కేంద్ర ముక్కుపిండి మరీ తమిళ పార్టీలు పట్టుకెళ్ళిపోతాయి. అందుకే ఎలాగైనా సరే తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పట్టు బిగించాలనేది పవన్, ఆయన ఢిల్లీ స్నేహితుల అజెండాగా కనబడుతోంది.
తమిళ స్పీచ్ లతో దుమ్మురేపుతున్న పవన్
తన సనాతన ధర్మ పరిరక్షణ ప్రసంగాలతో సంచలనం సృష్టిస్తున్న పవన్ మొదట్లో తమిళ నటుడైన కార్తీ, అక్కడ బాగా పట్టున్న ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేసినట్టు కనిపించినా.. నిన్న పేరు చెప్పకపోయినా ఉదయనిధి స్టాలిన్‌ను విమర్శించినా తమిళ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అన్నామలై లాంటి వాళ్ళ ఆవేశ పూరిత రాజకీయాల ద్వారా తమిళ ప్రజల్లోని ఒక సెక్షన్‌లో ప్రభావం పెంచుకుంది బీజేపీ. ఇప్పుడు సినీ రంగంలో పవర్ స్టార్ స్థాయిలో ఉన్న తమ స్నేహితుడు పవన్‌ని ఉపయోగించుకుని తమిళనాట బాగా చొచ్చుకుపోయే వ్యూహం పన్నిందనేది పొలిటికల్ ఎనలిస్టుల అంచనా. దానికి తగ్గట్టుగానే పవన్ అడుగులు కదుపుతున్నారని అందుకే పనికట్టుకుని మరీ తమిళ ఇంటర్వ్యూలు, తమిళ స్పీచ్‌లు ఇస్తూ తమిళ ప్రజల అభిమానం పొందే పనిలో పడ్డారనే వాదన కూడా వినిపిస్తోంది.
అసలే తమిళ నాట భాషాభిమానం, సినీ అభిమానం ఓ రేంజ్ లో సక్సెస్ అయిన ఫార్ములాలు. వాటికి తోడు సనాతన ధర్మ రక్షకుడిగా ఓ కొత్త వాదనతో తమిళ రాజకీయాల వైపు పవన్ అడుగులు వేస్తున్న దృశ్యం చాలా స్పష్టంగా కనబడుతుంది అన్న పొలిటికల్ అంచనాలు ఎంతమేర నిజమవుతాయో చూడాలి.