Dasara Navaratri 2024 Gayatri Devi Alankaram Today: దసరా నవరాత్రులలో రెండో రోజు దుర్గమ్మ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది.
గాయత్రి మంత్రం
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి దేవి. సకల వేదాలకు మూలం అయిన గాయత్రిని ఆరాధిస్తే మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. హేమ, నీల, ధవళ, ముక్త, విద్రుమ అనే ఐదు ముఖాలతో..శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది అమ్మవారు.
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే
Also Read: దేవీనవరాత్రులు ప్రారంభం , కలశ స్థాపన - ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా చదువుకోవాల్సిన స్తోత్రం ఇది!
ఆదిశంకరాచార్యుల వారు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపిణిగా అర్చించారు...
ప్రాతఃకాలంలో గాయత్రిగా
మధ్యాహ్నం సావిత్రిగా
సాయం సంధ్యలో సరస్వతిగా
మూడు సంధ్యలలోనూ ఉపాసకులతో పూజలందుకుంటోంది. గాయత్రీ ఉపాసన చేసేవారిలో బుద్ధి, తేజస్సు వృద్ధి చెందుతుంది. గాయత్రి మంత్ర జపం నాలుగు వేదాలు పారాయణం చేసినంత ఫలితాన్నిస్తుంది.
గాయత్రి అమ్మవారి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మదేవుడు, హృదయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ రెండో రోజు గాయత్రిదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఇంట్లో నవరాత్రుల పూజలు చేసుకునేవారు కూడా ఈ రోజు గాయత్రిని ఆరాధిస్తారు. నవదుర్గల్లో గాయత్రి దేవిని చంద్రఘంట అని పిలుస్తారు.
Also Read: వైష్ణోదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. IRCTC నార్త్ ఇండియా టూర్ ప్రత్యేక ప్యాకేజీ!
గాయక్రి మంత్రంలో ప్రతి అజ్ఞరం బీజాక్షరమే.. ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టే అని రుగ్వేదంలో ఉంది. ఈ మంత్రాన్ని ఓ నిర్ధిష్టపద్ధతిలో జపించినా, భక్తి శ్రద్ధలతో విన్నా సకల మానసిక సమస్యలు తొలగిపోతాయంటారు. ఈ మంత్ర జపం వల్ల ఆనందం, సానుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
గాయత్రి మంత్రాన్ని నిత్యం జపించేవారి మెదడులో నిరంతరం ప్రకంపనలు కొనసాగుతున్న అనుభూతి చెందుతారు. నిత్యం గాయత్రి మంత్రాన్ని జపించేవారు ఏ పని తలపెట్టినా విజయం పొందుతారు. గాయత్రి మంత్రోపాసన ఓ వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేస్తుంది. గాయత్రి మంత్రాన్ని నిత్యం జపిస్తే కంఠం, అంగుటిని ప్రభావితం చేస్తూ అక్కడి నుంచి నవనాడులకు వ్యాపిస్తుంది. శరీరంలో ఉన్న ఏడు చక్రాలపై ఈ ప్రభావం పడి ఉత్తేజితమవుతాయి. ఇంద్రియాలపై అదుపు సాధించేందుకు కూడా గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. అందుకే హిందూ ధర్మ శాస్త్రాల్లో ఎన్నో మంత్రాలు ఉన్నప్పటికీ గాయత్రి మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. గాయత్రి మంత్రానికి సమానమైనది ఏదీ నాలుగు వేదాల్లో లేదని విశ్వామిత్రుడు చెప్పాడు.
గాయత్రి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి....
Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు