Pawan Kalyan unveils Varahi Declaration at Tirupati |  తిరుమల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం మనం ఏం చేయాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలో పవన్ కళ్యాణ్ సూచించారు. ఓ యువనేత సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చారని, అయినా మనం ఏం చేయలేదన్నారు. ఇతర ధర్మాలను గౌరవించడం సనాతన ధర్మం మనకు నేర్పిందన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం చేసిన తప్పులను మన్నించి మనల్ని రక్షించాలని దేవుడ్ని వేడుకునేందుకు తాను చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను కొందరు ఎగతాళి చేశారని తెలిపారు.


సనాతన ధర్మాన్ని కించపరిచి, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి అపచారం చేసిన వారికి ఎన్నికల్లో దేవుడు తగిన శాస్తి చేశాడన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన తొలి బహిరంగ సభ ఇది. కాగా, తిరుమల లడ్డూ కల్తీ అంశం వివాదం అనంతరం తిరుపతి వేదికగా వారాహి డిక్లరేషన్ కోసం బహిరంగ సభ నిర్వహించారు.


వారాహి డిక్లరేషన్‌లో ఉన్న అంశాలివే..


1) ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
2) సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి. 
3) సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి.
4) సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5) సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6) ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
7) ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.


 



ఏపీలో గత కొన్నిరోజులుగా తిరుమల లడ్డూ కల్తీ అంశంపై వివాదం కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరస్వామికి అపచారం చేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్రంలో దుమారం రేగింది. టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చిన నెయ్యి శాంపిల్స్ గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (NDDB)కి పంపించగా.. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో నెయ్యి కల్తీ అయినట్లు తేలినట్లు స్పష్టం చేశారు. ఆ కల్తీ నెయ్యిని సరఫరాదారు అయిన ఏఆర్ డెయిరీకి తిప్పి పంపించారు. భక్తుల్లో అనుమానాలు, భయాలను తొలగించేందుకు కొన్ని రోజులు కిందట ఆగమ శాస్త్ర పండితుల సూచనలతో యాగం నిర్వహించారు.


Also Read: Pawan Kalyan: ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి, అల్లా పేరు అంటే ఆగిపోతారు- తిరుపతిలో పవన్ కళ్యాణ్