AP CM Chandra Babu Independence Day Speech : సమాజమే దేవాలయంగా ప్రజలే దైవుళ్లు అన్న ఎన్టీఆర్ పిలుపు మేరకు పాలన సాగుతుందన్న సీఎం చంద్రబాబు. సింపుల్ గవర్నమెంట్ ప్రజలకు చేరువగా ఉంటూ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడించి సరికొత్త విధానాలతో ప్రజలకు మంచి చేస్తున్నామన్నారు.
పడిన ప్రతిసారీ కెరటంలా లేచాం
60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో సవాళ్లతో రాష్ట్ర ప్రయాణం సాగింది. నవ్యాంధ్రకు రాజధాని లేని స్థితిలో పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చోవాలో తెలియని అనిశ్చిత్తి నుంచి పాలన ప్రారంభించాం. ప్రజల సహకారం, మా అనుభవంతో నిలదొక్కున్నాం. సరికొత్త పాలసీలో 13.5 శాతం వృద్ధి రేటుతో సగర్వంగా నిలబడ్డాం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణం మెరుగు పరిచాయం. 2014-19 కాలంలో రాష్ట్రం అనూహ్యంగా దూసుకెళ్లింది. రాజధాని లేని రాష్ట్రమని బాధపడలేదు. సవాళ్లను అవకాశంగా తీసుకొని అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. ప్రపంచం చర్చించుకునేలా నిలబడ్డాం.
నాడు అన్ని రంగాల్లో దూసుకెళ్లాం: చంద్రబాబు
మనది రైతు ఆధారిత రాష్ట్రం, సాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం. జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. 73 శాతం పనులు పూర్తి చేసాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈసారికి పోలవరం పూర్తి అయ్యేది. రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో జరిగిన అధికార మార్పిడి రాష్ట్రస్థితిని మార్చేసింది. ఒక్కఛాన్స్ అంటూ అధికారం చేసిన వాళ్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. పెను ఉత్పాదం సృష్టించారు. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన పాలన ప్రజారాజధాని అమరావతిని పురిట్లోనే చంపేప్రయత్నం చేశారు. ల్యాండ్, శాండ్, ఇలా అన్నింటా దోపిడీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. అప్పులతో రాష్ట్ర ఆర్థిక స్థితిలో తీవ్ర సంక్షోభం సృష్టించారు. విభజనతో కంటే విధ్వంస పాలనతోనే ఎక్కువ నష్టపోయింది.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు: చంద్రబాబు
ఐదేళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో కూటమికి పట్టం కట్టారు. అహంకార ప్రజాకంఠక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు. మోదీ, తాను, పవన్ ఇచ్చిన ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలకు అద్భుత విజయాన్ని అందించారు. ఎంతో నమ్మకంతో తమకు పట్టం కట్టారు. ఎన్నో ఆశలతో అండగా నిలబడ్డ ప్రజలకు స్వాతంత్ర్యం లభించింది. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తాం. తొలి రోజు నుంచే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. నిర్వీర్యం చేసిన వ్యవస్థను గాడిలో పెడుతున్నాం.
ఏపీ బ్రాండ్ తిరిగి పొందే ప్రయత్నాల్లో ఉన్నాం. సింపుల్‌గా హంగామాలకు దూరంగా ప్రజలకు దగ్గరంగా పాలన అందిస్తున్నాం. అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం అని ప్రజల జీవితాలను మార్చాలని ఉద్దేశంతో ఐదు అంశాలపై సంతకాలు చేసి పాలన ప్రారంభించాం.