Anakapalle News: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గోలుగొండ మండలం కొత్త ఎల్లవరంలో ఉంటున్న ఓ ఒంటరి మహిళకు తీరని అన్యాయం చేశారు అక్కడి అధికారులు. స్థానిక వైసీపీ నేత నిర్దాక్షణంగా, కక్ష పూరితంగా పావాడ వెంకటలక్ష్మి పాకను తొలగించారని గ్రామ సర్పంచ్ కొల్లి రాంబాబు అన్నారు. వెంకటలక్ష్మికి గ్రామంలో ఓటు హక్కు లేదని ఏ పార్టీకి సంబంధించిన మహిళ కాదని అయినా ఆమెపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని వాపోయారు. ఆమె చెల్లెలు ఎమ్మెల్యే గణేష్ ఇంటి వద్ద పనిచేస్తూ ఉంటదని అయినా ఎమ్మెల్యే గణేష్ కనికరించలేదని తన ఇంట్లో పని చేసే వారికే న్యాయం చేయలేని ఎమ్మెల్యే ప్రజలకు ఏం న్యాయం చేస్తారని అన్నారు. ఆమె మూడు రోజులు గడువు ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా... నిర్ధాక్షణంగా ఆమెను రోడ్డు పాలు చేశారని పేర్కొన్నారు. 


వివరాల్లోకి వెళితే చెరువు ఆక్రమణకు గురైందని అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. 20 ఏళ్ల క్రితం చెరువు ఒడ్డున వేసుకున్న పూరి పాకను రెవెన్యూ అధికారులు, ఎస్ఐ నారాయణ రావు దగ్గరుండి తొలగించారు. కానీ అదే చెరువును అనుకోని ఇళ్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఇచ్చి మిన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన మండలంలోని కొత్తఎల్లవరం గ్రామంలో చెరువుకు చెందిన స్థలంలో ఎనిమిది మంది ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో ఐదు పక్కా భవనాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే పావాడ వెంకటలక్ష్మికి చెందిన పూరి పాకను మాత్రమే రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో వెంకటలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురై రోడ్డుపై బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. వారం రోజుల్లో ఆక్రమణ తొలగిస్తామని గ్రామ సర్పంచ్ కొల్లి రాంబాబు అధికారులను కోరినప్పటికీ తమకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం మిగిలిన, పక్కా భవనాలకు నోటీసులు అందించి, త్వరలో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు.


నిన్నటికి నిన్న నంద్యాలలో టీడీపీ నేత ప్రహారీ కూల్చివేత..


నంద్యాల జిల్లాలో టీడీపీ నేతకు చెందిన ఓ గోడ కూల్చివేత ఘటన ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. నంద్యాల మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మురళీ కృష్ణ గౌడ్‌కు చెందిన గోడను కూల్చారు. ఆయనకు ఓ వెంచర్‌ ఉండగా, దానికి ఆయన రక్షణ ఓ గోడను నిర్మించుకున్నారు. అయితే, ఈ గోడను కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు మంగళవారం (నవంబరు 15) కూల్చి వేశారు.







అయితే, ఆ వెంచర్ చుట్టూ గోడను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించుకున్నారని కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు ఆరోపించారు. దీంతో అధికారులు పొక్లెయిన్‌ తెచ్చి కూల్చివేతకు రెడీ అయ్యారు. ఇంతలో వెంచర్‌లోని ఇళ్ల యజమానులు, మురళీ కృష్ణ గౌడ్‌, ఆయన సోదరులు అడ్డుకున్నారు. అనుమతులు లేనందువల్లే తాము గోడను కూల్చి వేశామని చెప్పారు. అయితే, లే అవుట్‌కు కుడా (కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అనుమతులున్నాయని బాధితులు చెప్పారు. 






తాము టీడీపీ (TDP) లీడర్లం అయినందుకే ఇలా తమను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రహరీని కూల్చి వేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆదేశించారని బాధితులు ఆరోపించారు. ఆయన తమ గోడను అక్రమంగా కూల్చి వేయిస్తున్నారని వాపోయారు. తాము ఆ ప్రహరీ కట్టి పదేళ్లు అవుతోందని, పదేళ్లుగా ప్రహరీ ఉండగా, కుడా అధికారులకు ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తు వచ్చిందని ప్రశ్నించారు.