Ysrcp Internal Politics : విశాఖ ఘటనపై మంత్రులు అసంతృప్తి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తమపై జరిగిన దాడి వ్యవహరంలో పార్టీ పెద్దలు, తోటి మంత్రులు, కీలక నాయకులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తిలో  ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. విశాఖ గర్జన తరువాత పరిణామాలపై పార్టీలో పంచనామా జరుగుతుంది. తమ పై జరిగిన దాడి తరువాత ఈ వ్యవహరంలో రాజకీయంగా పార్టీలోని తోటి మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు అనుసరించిన వైఖరిని గురించి తెలుసుకున్న మంత్రులు ఇలా అయితే ఎలా అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మంత్రి రోజాతో పాటు మరో మహిళ మంత్రి రజని, దళిత మంత్రి మేరుగ నాగార్జునతో పాటుగా బీసీ వర్గానికి చెందిన మరో మంత్రి జోగి రమేష్ పై కూడా విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా వైసీపీ విడుదల చేసింది. విశాఖ గర్జన తరువాత తిరుగుప్రయాణంలో ఎయిర్ పోర్టుకు వచ్చిన మంత్రులపై జనసేనకు సంబంధించిన కొందరు వ్యక్తులు దాడి చేశారని చెబుతున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. 


మంత్రుల అసంతృప్తి! 


వైసీపీలో మాత్రం అంతర్గతంగా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. వైసీపీకి చెందిన మంత్రులపై దాడి జరిగితే ఆ తరువాత పోలీసులు కేసులు నమోదు చేయటం, జనసేనకు చెందిన నాయకులను అరెస్ట్ చేయటం, కొందరికి బెయిల్ రావటం రిమాండ్ విధించటం చట్టపరంగా జరిగిపోయాయి. అయితే పార్టీ నుంచి ఈ ఘటన పై రియాక్ట్ అయిన తీరుపై చర్చ నడుస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ, అది కూడా మహిళా మంత్రుల, బీసీ, ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులపై దాడి జరిగితే ఘటనపై తోటి మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ, పార్టీలోని అధికార ప్రతినిధులు, ఇతర సీనియర్ నాయకులు కానీ ఆశించిన స్థాయిలో స్పంధించలేదని బాధిత మంత్రులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ మంత్రులు పై జరిగిన దాడిని అదే స్థాయిలో ఖండించకపోవటం, కనీసం నిరసనలు కూడా చేయకపోవటం, ఒకరిద్దరు పార్టీ నాయకులు మాత్రం ఖండించినట్లుగా స్టేట్ మెంట్లు ఇచ్చి సరిపెట్టుకోవటంపై కూడా చర్చ నడుస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఊహించని స్థాయిలో రియాక్షన్ కానీ, సానుభూతి కానీ రాలేదని అంటున్నారు. దీంతో చివరకు రోజా కూడా ఇదే విషయంపై బీజేపి నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చ జరుగుతుంది. తోటి మహిళ అయ్యి ఉండి తనను పరామర్శించకుండా, దాడికి పాల్పడిన జనసేన అధినేతతో ఫోన్ లో మాట్లాడటం ఏంటని రోజా నేరుగా ప్రశ్నించారు. 


పార్టీ అలా చేయటం కరెక్టే! 


మంత్రుల అభిప్రాయాలను పరిశీలించిన కొందరు పార్టీ పెద్దలు విశాఖ ఘటనపై వేరే విధంగా రియాక్ట్ అయ్యి ఉంటే అది కూడా పార్టికే నష్టం కదా అని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బాధ్యతగా వ్యవహరించి సంయమనం పాటించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లినట్లు అయ్యిందని సర్దిచెప్పుకోచ్చారని అంటున్నారు.


రోజా ఆవేదన 


విశాఖ గర్జన అనంతరం మంత్రి రోజా వెంటనే ఎయిర్ పోర్ట్ కు వెళ్లి అక్కడ నుంచి విజయవాడ వెళ్లేందుకు షెడ్యూల్ ఉంది. అయితే అప్పటికే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న పరిస్థితులను వివరించారు. అంతే కాదు త్వరగా వెళితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లిపోవచ్చని పోలీసులు నుంచి క్లియరెన్స్ కూడా తీసుకున్నారు. దీంతో టీ కూడా తాగకుండానే రోజా ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. అయినా ఊహించని పరిణామం ఎదురైందని రోజా పార్టీ పెద్దల వద్ద వ్యాఖ్యానించారని సమాచారం.  


పీకే రిపోర్ట్ ఏంటంటే? 


విశాఖ గర్జన సభ తరువాత పరిణామాలపై పీకే టీం నివేదిక రెడీ చేసింది. ఇందులో కీలక అంశాలు పరిగణంలోకి తీసుకున్నారు. గర్జనలో పాల్గోన్న నాయకులు, మంత్రులు, వారు మాట్లాడిన స్టేట్ మెంట్ లతో పాటు ఎవరెవరు ఎంత సేపు మాట్లాడారు అనే విషయాలు కూడా రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే వీటన్నింటికి మించి గర్జన తరువాత జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్ లో ఉందని సమాచారం. గర్జన పేరుతో సభ జరిగినా ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయామని, విద్యార్థులను సభలకు తరలించటంపై కూడా పీకే రిపోర్ట్ లో ఉందని ప్రచారం జరుగుతుంది.