Konda Movie : కొండా చిత్రం ప్రమోషన్ లో బిజిగా ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ ఏబీపీ దేశంతో మాట్లాడారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ కొండా చిత్రాన్ని వివాదాలు లేకుండా నిర్మించారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సలిజం, లవ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని, భావితరాలకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. కొండా చిత్రం ప్రమోషన్ వర్క్ లో భాగంగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. తనకు టీ పార్టీ గురించే తెలియదని ఇక రాజకీయాలు ఏం తెలుస్తాయని వర్మ అన్నారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ నేతృత్వంలో పార్టీ ఏర్పాటు విషయం తనకు తెలియదని వర్మ అన్నారు. ఇక కొండా చిత్రం బతికున్న మనుషుల నుంచి సేకరించిన స్టోరీ కాబట్టి వివాదాలకు ఆస్కారం ఎక్కడుంటుందని తెలిపారు. బెజవాడ రౌడీలు చిత్రం వేరు, కొండా చిత్రం పూర్తిగా డిఫరెంట్ అని ఆర్జీవీ అన్నారు.
ఇక్కడే చదివా కానీ దర్శనానికి రాలేదు-ఆర్జీవీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా చిత్ర యూనిట్ సోమవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ విజయవాడలో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదన్నారు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నానన్నారు. కొండా దంపతుల భక్తి పారవశ్యం తనను ఆకర్షించిందన్నారు. కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నానన్న వర్మ... సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆర్జీవీ దేవుడు పంపిన దూతలా వచ్చి తమ బయోపిక్ తీశారన్నారు. తమ బయోపిక్ సినిమాలో కేవలం 10 శాతం మాత్రమే అన్నారు. పూర్తి బయోపిక్ తియ్యాలంటే వెబ్ సిరీస్ సరిపోదన్నారు. ఏ శత్రువుకి రాని అనుభవాలు తాము భరించామన్నారు. తన పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడిందన్న సురేఖ... కొండా సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తామని పేర్కొన్నారు.
వైఎస్ తో అనుబంధం-కొండా సురేఖ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆయనతో తప్ప మరెవరితోనూ ఆత్మీయత, అనుబంధం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కొండా మురళి బయోపిక్‌గా రూపొందిన కొండా సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా దంపతుల జీవిత చరిత్ర ప్రజలకు తెలిపేందుకు సినిమా తీశామని...ఎన్ని ఒడుడుకులు నిజం జీవితంలో ఎదుర్కొన్నాం అనే విషయాలను ఈ సినిమా ద్వారా బయట ప్రపంచానికి తెలుస్తుందన్నారు. నిజ జీవితంలో నక్సల్ ఉద్యమం, రాజకీయ ప్రయాణం, మా లవ్ స్టోరీ బేస్ చేసుకొని సినిమా తీశారని వెల్లడించారు. కొండా సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్నామని ఇందులో రాజకీయం ఏమీ లేదన్నారు. తాము వైఎస్ఆర్ రాజకీయ భిక్షతోనే ఈ స్థితిలో ఉన్నామన్నారు.నేటి రాజకీయాల్లో విలువలు అనేవి లేవని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని ఆమె విమర్శించారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చెయ్యాల్సి ఉందని అయితే ఇప్పుడు ఆ పరిస్దితులు లేవని అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ కుటుంబాన్ని కలవలేదని చెప్పారు.వైఎస్ఆర్ తోనే తమ కుటుంబానికి అనుంబందం ఉందని,వారి కుటంబ సభ్యులతో రిలేషన్ లేదని వివరించారు. పార్టీకి రాజీనామా చేశాక విజయమ్మ, షర్మిలమ్మతో ఓ కేసు కోర్టు వాయిదాలో మాత్రమే కలిశామన్నారు.