Revanth Reddy On BJP : సోనియా గాంధీ ఈడీ ఆఫీసులో అడుగుపెడితే మోదీ పునాదులు కదులుతాయ్ - రేవంత్ రెడ్డి
Revanth Reddy On BJP : సోనియా గాంధీ ఈడీ ఆఫీసులో అడుగుపెడితే మోదీ పునాదులు కదులుతాయ్ - రేవంత్ రెడ్డి
ABP Desam Updated at:
13 Jun 2022 04:17 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
Revanth Reddy On BJP : కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందన్న భయంతోనే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు బీజేపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy On BJP : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా అగ్రనేతలు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ వాయిస్ ఈ పత్రిక
బషీర్ బాగ్ ఈడీ కార్యలయం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ కోసం స్థాపించిన పత్రిక నేషనల్ హెరాల్డ్ అని అన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన పత్రికను తిరిగి నడపడానికి రాహుల్ నడుంకట్టారన్నారు. రూ.90 కోట్ల అప్పుల్లో ఉన్న ఆ పత్రికను తిరిగి తెరిచారన్నారు. బీజేపీ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న పత్రికపై కక్షసాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందులో అక్రమాలు జరిగాయి అని నోటీసులు ఇచ్చారన్నారు. సుబ్రమణ్యస్వామి ఈడీకి ఫిర్యాదు చేస్తే 2105 లోనే అక్రమాలు ఏమి జరగలేదని రిపోర్ట్ ఇచ్చిందన్నారు. మళ్లీ దాన్ని మోదీ సర్కార్ మళ్లీ రీఓపెన్ చేసిందన్నారు.
మోదీ పునాదులు కదులుతాయ్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని భయంతోనే మోదీ నోటీసులు పంపారు. పెరిగిన పెట్రిల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి స్వస్తి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం. రాహుల్ కు 50 లక్షలు కాదు రూ.5 వేల కోట్లు కావాలన్నా 24 గంటల్లో కాంగ్రెస్ అభిమానులు ఇవ్వగలరు. గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అక్కర్లేదు. అన్ని రాష్ట్రాలలోనూ ఈడీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతున్నాం.1980లో కూడా ఇందిరా గాంధీపై కేసు పెడితే తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 23న సోనియా గాంధీ ఈడీ కార్యాలయంలో అడుగుపెడితే మోదీ పునాదులు కదులుతాయి. గాంధీ కుటుంబం మీద ఈగ వాలినా రాజకీయంగా బతికి బట్టకట్టలేరు. తెలంగాణ కళ సాకారం చేసిన దేవత సోనియా గాంధీ. తెలంగాణ తల్లి సోనియాను ఈడీ ఆఫీస్ కు పిలుస్తే ఊరుకోం. గాంధీ వారసులం కాబట్టి శాంతి యుతంగా నిరసన తెలుపుతున్నాం - -- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
బీజేపీ బెదిరింపులకు భయపడం
ఈడీ నోటీసులకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భయపడే వ్యక్తులు కాదు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు. ఇందిరా గాంధీని జైలుకు పంపిస్తే ఏం జరిగిందో దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ , సోనియా గాంధీలను కాపాడుకుంటాం. బీజేపీని ఈ దేశం నుంచి తరిమికొడతాం. ఇది అంతం కాదు ఆరంభం. - - భట్టి విక్రమార్క, సీఏల్పీ నేత