Ganesh Chaturthi 2022 : ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుపై వివాదం నెలకొంది. గణేష్ ఉత్సవ్ కమిటీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. మండపాల ఏర్పాటుపై విద్యుత్ శాఖ నుంచి పర్మిషన్ తో పాటు డీజేలు పెట్టకూడదని నిబంధనలు పెట్టింది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వం కావాలనే హిందూ పండుగలను టార్గెట్ చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం రుసుముల భారం మోపిందని వస్తున్న విమర్శలపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక మండపాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ కమిషనర్ జవహర్ లాల్ స్పష్టం చేశారు. రుసుం వసూలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఎవరైనా రుసుం చెల్లించాలని అడిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియోలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
సోము వీర్రాజు ఫైర్
ఏపీలో వినాయక చవితి పండుగలకు ప్రభుత్వం అడ్డంకులను సృష్టిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చారు. విఘ్నాధిపతి వేడుకులకు విఘ్నాలా ఇదేమి ప్రభుత్వం నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకులకు పరోక్ష ఆటంకాలకు పాల్పడుతున్న అనుమానాలు బలపడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపు నిరసనలు
ఆందోళనలు, నిరసనలు నిర్వహించాలని సోమువీర్రాజు బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ పదాధికారులు జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీల ఇన్చార్జిల ఫోన్ కాన్ఫరెన్స్ లో రేపు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహసిల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని నిరసన కార్యక్రమాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలు, ఆందోళన తర్వాత తహసీల్దారులకు వినతి పత్రం సమర్పించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు. వినాయక చవితి ఉత్సవాలకు మంటపాలు, పందిళ్లు ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది.
నిర్వాహకులకు నిబంధనలు
హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే వినాయక చవితి పండుగను నిబంధనల పేరుతో పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో వీధుల్లో వాడల్లో జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఆంక్షలు పెట్టడం ద్వారా వినాయక చవితి ఉత్సవాలను నిర్వాహకులను నిరుత్సాహపరచి, మంటపాల సంఖ్యను రాష్ట్ర వ్యాప్తంగా తగ్గించాలనే కుట్ర జరుపుతోందని సోము వీర్రాజు తీవ్రంగా దుయ్యపట్టారు. ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలని కుట్రపూరితంగా రాష్ట్ర డీజీపీ ద్వారా ఆదేశాలు జారీ చేయించి క్షేత్రస్థాయిలో మండపాల నిర్వాహకులను ఉత్సవ సమితి సభ్యులను వివిధ రకాలుగా వేధిస్తూ ఈ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Ganesh Chaturdhi 2022 : వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి, మార్గదర్శకాలు విడుదల
Also Read : Vinayaka Chavithi 2022 : గణేష్ ఉత్సవ కమిటీలను నిబంధనల పేరుతో వేధిస్తున్నారు, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ