Vinayaka Chavithi 2022 : వినాయక చవితి పండుగను స్వేచ్ఛగా జరుపుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ సీఎం జ‌గ‌న్ కు బీజేపీ నేత‌లు విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జ‌గ‌న్ కు లేఖ రాశారు. దశాబ్దాల తరబడి ఆనవాయితీగా చలువపందిళ్లు ఏర్పాటు చేసి  వినాయక నవరాత్రులు నిర్వహించే  ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం నిబంధనలు పేరుతో  పోలీసులు ఉత్సవ కమిటీలను భయభ్రాంతులకు గురి చేయడం వెంటనే మానుకోవాలని బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని వీర్రాజు అన్నారు. హిందువుల తొలిపండుగ అయిన వినాయక చవితి ఉత్సవాలను రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని సోము వీర్రాజు కోరారు.  గత సంవత్సరం కోవిడ్ నిబంధనల పేరుతో వినాయక చవితి ఉత్సవాలను తగ్గించే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఉద్యమాన్ని గుర్తుచేస్తున్నామన్నారు. 


సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ 


వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పల్లెల్లో, పట్టణ, నగరాల్లోని  అన్ని కూడళ్లలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి హిందూ ధర్మ ఆచారం అన్నారు సోము వీర్రాజు. కానీ ఇందుకు విరుద్ధంగా ఈ ఏడాది  వినాయక చవితి వేడుకల్లో డీజే సౌండ్ సిస్టంగానీ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు గాని జరపటానికి వీలు లేకుండా, అఫిడవిట్లు ఇవ్వాలని, నిర్వాహకులు సంతకాలతో ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడం, విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని ఇతర నిబంధనల పేరుతో పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. దీనిని బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  వినాయక చవితి ఉత్సవాలను జరపాలంటేనే హిందువులు భయపడేలాగా నిబంధనలు విధించడం ఏమాత్రం సరికాదన్నారు.  ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. వినాయక చవితి ఉత్సవాలను బహిరంగ ప్రదేశాల్లో కానీ, వీధి వీధిలో గానీ లేదా అనువైన ప్రైవేట్ స్థలాల్లో గానీ ఏర్పాటు చేసుకోవడం చుట్టుపక్కల ఎవరో ఒక భక్తుడు ఆ పందిరికి ఉచితంగా కరెంటు సౌకర్యాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు.  కానీ పోలీస్ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో ప్రతి పందిరికి కూడా తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి తద్వారా తాత్కాలిక కనెక్షన్ పొందాలనే నిబంధనలను విధించడం రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశం ఉందన్నారు. 



కుట్రపూరితంగానే నిబంధనలు


రాష్ట్ర ప్రభుత్వం వినాయక ఉత్సవాలను హిందువులు జరుపుకోకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.  ఇలాంటి చర్యలతో హిందూ సమాజాన్ని హిందూ పండగలను వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసేందుకు వివిధ మార్గాల్లో కుట్రలు చేస్తుంది. వినాయక చవితి ఉత్సవాలను వాటికి కావలసినటువంటి సౌకర్యాలను ఎటువంటి రుసుమును లేకుండానే ఎందుకు ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేకపోతుందో చెప్పే ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నిస్తున్నాను. వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని నిబంధనలను సడలించి ఎక్కడ ఏ వినాయక మండపం లేదా చలవపందిళ్ళు వేసుకొని వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులకు ఎటువంటి రుసుం  వసూలు చేయకుండానే వెంటనే అనుమతులు మంజూరు చేయాలని  డిమాండ్ చేస్తున్నాను. వినాయక చవితి పందిళ్లలో డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా  కలగజేయాలని కోరుతున్నాను.  వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకునే వారికి సమీపంలోని భక్తుల నివాసాల నుంచి విద్యుత్తును పొందే అనుమతిని కూడా ఈ ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నాను. - సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 


నిర్వాహకులను తిప్పుకోవడం సమంజసమా? 


గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజలకు కావలసిన సేవలను అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే నిబంధనల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ నిర్వాహకులు తిప్పడం ఏరకంగా సమంజసమా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.  అందువల్ల వెంటనే ఈ అంశంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని వినాయక చవితి ఉత్సవాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో చేసుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు.  అలా కాని పక్షంలో ప్రభుత్వం హిందూ వ్యతిరేక కార్యకలాపాలను ఇంకా కొనసాగిస్తోందని భావించవలసి వస్తుందన్నారు.