ఆడుకునే వయసులో పిల్లలు చేతికి దొరికినవి నోటిలో పెట్టుకుంటారు. కొన్నిసార్లు వాటిని మింగేస్తారు. ఇలాంటి ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఎనిమిదేళ్ల బాలుడు(Boy) అయస్కాంతాన్ని(Magnet) మింగేశాడు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బాలుడిని అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ రమేష్ ఆసుపత్రికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. బాలుడికి వైద్య పరీక్షలు(Medical Tests) నిర్వహించిన జీర్ణకోశ వ్యాధినిపుణులు డా.లోకేష్  అండాకారంలో ఉన్న అయస్కాంతాన్ని బాలుడు కడుపులో గుర్తించారు. ఎండోస్కోపిక్‌(Endoscopic) విధానంలో అత్యవసర చికిత్స చేసి అయస్కాంతాన్ని బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు.


మంగళవారం రాత్రి ఎనిమిదేళ్ల బాలుడు అయస్కాంతం మింగినట్లు తల్లిదండ్రులు గ్రహించి రమేష్‌ హాస్పిటల్స్‌(Ramesh Hospitals)కు తీసుకొచ్చారు. ఐరన్‌, అల్యూమినియం(Alluminium), నికెల్‌, కోబాల్ట్‌ కొన్ని అరుదైన ఎలిమెంట్స్‌తో కూడిన అండాకారంలో ఉన్న అయస్కాంతాన్ని బాలుడు మింగేశాడు. ఈ అయస్కాంతం చిన్న ప్రేగులలో ఇరుక్కోవటం వలన పేగులు చిట్లిపోవటం జరిగే ప్రమాదం ఉందని గుర్తించిన వైద్యులు ఎండోస్కోపిక్‌ విధానంలో బయటకు తీసివేశారు. ఇటువంటి వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలని తలిదండ్రులకు వైద్యులు సూచించారు. 


బ్యాటరీ మింగేసిన బాలుడు


చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారి పరిసర ప్రాంతాల్లో చిన్ని చిన్ని వస్తువులు ఏవీ కనిపించకూడదు. వాటిని తినే వస్తువులు అనుకుని నోట్లో పెట్టేసుకుంటారు. చెన్నైకు చెందిన ఓ నాలుగేళ్ల ఇలాంటి ప్రమాదంలోనే చిక్కుకున్నాడు. రిమోట్‌తో ఆటలాడుతూ.. 5 సెంటీమీటర్ల పొడవున్న బ్యాటరీని తీసి నోట్లో పెట్టుకున్నాడు. అది అనుకోకుండా కడుపులోకి జారుకుంది. దీంతో పిల్లాడు ఏడ్వడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడ ఉన్న అతడి తల్లిదండ్రులకు అనుమానం కలిగి వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కాబట్టి సరిపోయింది. ఆ విషయం వారికి తెలిసి ఉండకపోతే.. బ్యాటరీలోని రసాయనాలు ఆ పిల్లాడి కడుపులోకి చేరేవి. 


బాలుడికి ఎక్స్‌రే చేసిన వైద్యులు.. కడుపులో బ్యాటరీని కనుగొన్నారు. అయితే, దాన్ని సర్జరీతో మాత్రమే తొలగించాలని తొలుత భావించారు. అయితే, దాని వల్ల పిల్లాడు ఇబ్బంది పడతాడని భావించిన వైద్యులు.. ఎండోస్కోపీ విధానంలో బ్యాటరీని బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే, దాని వల్ల అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వెనుకడుగు వేశారు. ఆలస్యం చేస్తే ప్రాణాలకు మరింత ప్రమాదమని భావించిన వైద్యులు చివరికి ఎండోస్కోపీ ద్వారానే బ్యాటరీ బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. వైద్యులు ఆ బాలుడి నోటి నుంచి నెమ్మదిగా పైపును పంపి.. కడుపులో ఉన్న బ్యాటరీ వరకు చేరుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఎంతో జాగ్రత్తగా, అతడి అంతర్గత అవయవాలకు గాయాలు కాకుండా బయటకు తెచ్చారు. ఇందుకు సుమారు 14 గంటలు శ్రమించారు. బ్యాటరీలోని రసాయానాలు లీకయ్యే లోపే.. దాన్ని బయటకు తీసేసి పసివాడి ప్రాణాలు కాపాడారు.  


ఈ చికిత్సను రేలా హాస్పిటల్‌లో నిర్వహించారు. సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆర్.రవి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దాదాపు 14 గంటలు శ్రమించి ఎంతో జాగ్రత్తగా ఆ బ్యాటరీని బయటకు తీశాం. పిల్లలు మనకు తెలియకుండానే బటన్లు, నాణేలు, బ్యాటరీలు తదితర చిన్న చిన్న వస్తువులను మింగేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాటిని మలంతోపాటు బయటకు రావు. కడుపులోనే ఉండిపోతాయి. కడుపు నుంచి కొన్ని యాసిడ్లు విడుదలవుతాయి. దాని వల్ల బ్యాటరీ తుప్పు పడుతుంది. ఆ తర్వాత అందులోని రసాయనాలను కడుపులోకి వదులుతుంది. అది విషపూరితమై ప్రాణాలకు ప్రమాదకరం కావచ్చు’’ అని తెలిపారు.