కర్నూలు జిల్లాకు న్యాయరాజధాని తరలింపుపై కేంద్రంలో కొత్తగా న్యాయశాఖ బాధ్యతలు తీసుకున్న కిరణ్ రిజుజుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ మేరకు కర్నూలులో న్యాయరాజధానిని ఖరారు చేశామని హైకోర్టుకు అక్కడకు వీలైనంత త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కర్నూలులో నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయించినందున హైకోర్టు ఎక్కడ ఉంటే... జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడ ఉండటం సబబని అందుకే కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. అదే సమయంలో నేషనల్ జ్యూడిషియల్ అకాడెమీని కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి దేశం మొత్తం మీద మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాత్రమే ఉందని.. అందు వల్ల రెండో దాన్ని ఏర్పాటు చేయాలని.. దాన్ని కర్నూలులోనే పెట్టాలని కోరారు. ఇలా చేయడం వల్ల భోపాల్ క్యాంపస్ మీద భారం తగ్గుతుందన్నారు.
ఈ లేఖలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఉన్నట్లే రైతుల కోసం కూడా ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజును కోరారు. దేశంలో నలభై శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నారని కానీ వారిపై సరైన హక్కులు అందడం లేదని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై రాజ్యసభలో తాను 2019లోనే ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టానని గుర్తు చేశారు. ప్రస్తుతానికి ఇది రాజ్యసభలో పెండింగ్‌లో ఉందన్నారు. ఈ బిల్లును రూపొందించడానికి ప్రత్యేకంగా రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెట్టాలని విజయసాయిరెడ్డి కోరారు.
అలాగే లేఖలో మొదటి పాయింట్‌గా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మార్చాలనికోరారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం.. ఓ పార్టీపై గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయిస్తే అనర్హతా వేటు వేయాలని ఉందని.. అయితే ఆ వేటు వేయడానికి టైమ్ ఫ్రేమ్ లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేసిందని లేఖలో గుర్తు చేశారు. అయితే చట్టంలో అలాంటి టైమ్ ఫ్రేమ్ లేనందున చాలా సందర్భాల్లో అనర్హతా వేటుపై నిర్ణయం తీసుకోవడం లేదని దీని వల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం ఉద్దేశం దెబ్బతింటోందన్నారు. అందుకే ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును టార్గెట్ చేసుకుని ఈ అంశాన్ని కేంద్ర న్యాయమంత్రికి రాసిన లేఖలో విజయసాయిరెడ్డి ప్రధానంగా ప్రస్తావించినట్లుగా భావిస్తున్నారు.