Vijayasai Reddy Phone :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి చెందిన వ్యక్తిగత ఫోన్ కనిపించడం లేదు. ఆ ఫోన్‌ను ఎవరో తీసుకెళ్లిపోయి ఉంటారన్న ఉద్దేశంతో ఆయన పర్సనల్ అసిస్టెంట్ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందని పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన ఫోన్ ఎక్కడ ఉందో వెదుకుతున్నట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి లెటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ వాడుతూంటారు. ప్రతీ రోజూ ఆయనను కలిసేందుకు వందల మంది వస్తూంటారు. పార్టీలో కూడా కీలక బాధ్యతల్లో ఉండటంతో.. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎక్కువగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎక్కడో మిస్ అయి ఉంటుందని భావిస్తున్నారు. 


ఫోన్ అంటే పూర్తిగా వ్యక్తిగత సమాచారం నిక్షిప్తమయ్యే గాడ్జెట్ 


ఈ రోజుల్లో ఫోన్ అంటే... పూర్తిగా డేటాతో నిండి ఉంటుంది. ఫోన్ వాడేవారి వ్యక్తిగత సమాచారం మొత్తం ఫోన్‌లో ఉంటుంది. అది ఎవరికైనా దొరికే ఇక వ్యక్తిగత విషయాలన్నీ ఎదుటి వారికి తెలిసిపోతాయి. అందుకే ప్రస్తుతం ఫోన్ పోతే.. పోయిందిలే అని ఊరుకోకుండా ఫోలీసులకు సైతం ఫిర్యాదు చేసి.. ఎలాగోలా వనక్కి తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డికి ప్రభుత్వంలో పలుకుబడి ఉంది. ఆయన ఫోన్ పోయిందని కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వెంటనే ఫోన్ డీటైల్స్‌తో ఎక్కడ ఉందో పోలీసులు ట్రాక్ చేసి.. పట్టేసుకుంటారు.  కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.  


విజయసాయిరెడ్డి కావాలనే ఫోన్ పడేశారంటున్న టీడీపీ నేతలు 


అందుకే విజయసాయిరెడ్డి ఫోన్ లేదని.. కావాలనే పడేశారని టీడీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. తన ఫోన్ పోయిందని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా తెలిసిన కొంత సేపటికే టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు... ఆయన ఫోన్ పోలేదని..పడేశారని ట్వీట్ చేశారు. 






ఢిల్లీ లిక్కర్ స్కామ్ రహస్యాలు బయటకు వస్తాయనే అలా చేశారంటున్న టీడీపీ


మరో  టీడీపీ నేత జవహర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం  చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలో.. శరత్ చంద్రారెడ్డిని జైలుకు పంపిన తర్వాత విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందని ఎందుకు చెబుతున్నారని జవహర్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఈడీ, సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి.. .. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సొంత సోదరుడు.   అలాగే ఏపీలో మద్యం దుకాణాలకు పెద్ద ఎత్తున మద్యాన్ని సరఫరా చేసే అదాన్ డిస్టిలరీస్‌తోనూ వారికి సంబంధాలున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో  విజయసాయిరెడ్డి ఫోన్ పోవడంతో.. .. దీన్ని కూడా ఆ కోణంలోనే తీసుకుని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.