Vijaysai Reaction :  విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నారని విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. దసపల్లా భూములు పూర్తిగా ప్రైవేటువేనని..  ఆ భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేశామన్నారు. ఆ భూములు ప్రైవేటువే అయినప్పుడు 22ఏ నుంచి తీసేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల నాలుగు వందల కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. చంద్రబాబు సామాజికవర్గం వారే ఎక్కువ లాభపడ్డారని ఆయన చెప్పారు. 


తన కుమార్తె, , అల్లుడు భూములు కొంటే తనకేం సంబంధం అని విజయసాయిరెడ్డి ప్రశ్న


విజయసాయిరెడ్డి కుమార్తె  , అల్లుడు డైరక్టర్లుగా ఉన్న కంపెనీ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిందని వచ్చిన ఆరోపణలపైనా విజయసాయిరెడ్డి స్పందించారు. వారు భూములు కొనుగోలు చేయడంలో తన పాత్రేమీ లేదన్నారు. తనకు ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్  మాత్రమే ఉందని.. తాను ఇంత వరకూ ఎలాంటి వ్యాపారాలు చేయలేదని స్పష్టం చేశారు.  తన కుమార్తె కుటుంబం నాలుగు దశాబ్దాలుగా వ్యాపారంలో ఉందని... వాళ్లు భూములు కొనుగోలు చేస్తే తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి భూములు కొనుగోలు చేస్తే బాలకృష్ణకు ఏం సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.  


తన ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమని విజయసాయిరెడ్డి ప్రకటన


తన ఆస్తులపై సీబీఐ విచారణకు తాను సిద్ధమని విజయసాయిరెడ్డి ప్రకటించారు.  ఉత్తరాంధ్రకు రాజధాని రాకూడదనే విశాఖ భూముల కొనుగోళ్లలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒక వ్యక్తి అంటున్నారంటూ పరోక్షంగా వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై మండిపడ్డారు. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటో ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. అమరావతిలో జరిగిందాన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారని చెప్పారు. విశాఖలో చాలా మంది ఇతర సామాజికవర్గాల వారు ఉంటారు కానీ భూములు మాత్రం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారి చేతుల్లోనే ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు.  విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా చేయడానికే ఇలా ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. 


తాను మీడియా రంగంలోకి వస్తున్నానని విజయసాయిరెడ్డి ప్రకటన 


తాను మీడియా రంగంలోకి వస్తున్నానని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. తాను ఇంత వరకూ వ్యాపారాలు చేయలేదు కానీ.. తాను మీడియా రంగంలోకి వస్తానన్నారు. తనపై అసత్యప్రచారాలు చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలపై ఆరోపణలు గుప్పించారు. వారి మీడియాలు.. తన మీడియా ఎలా పని చేస్తుందో చూపిస్తానన్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ కుటుంబానికి సాక్షి మీడియా ఉంది. అయితే విజయసాయిరెడ్డి మళ్లీ తాను సొంతంగా తన కోసం మీడియా పెడతానని ప్రకటించడం వైఎస్ఆర్‌సీపీ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. 


ప్రజారాజ్యం అప్పులకు చిరంజీవి అమ్మేసిన 'కృష్ణా గార్డెన్స్' చరిత్ర ఏమిటి? ఇప్పుడు దాని విలువ ఎంత?