Balakrishna Unstoppable Season 4 With Chandrababu | నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. తొలి గెస్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి పలు ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు. బాలయ్య, చంద్రబాబు మొదట ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇది కలికాలం బావా.. నాడు ద్వాపర యుగంలో బామ్మర్ది భగవద్గీత చెబితే బావ విన్నాడు. ఇప్పుడు బావ చెబితే బామ్మర్ది వింటున్నాడంటూ బాలయ్య నవ్వులు పూయించారు. చంద్రబాబు అనే నేను బాలకృష్ణపై ప్రేమతో, మర్యాదగా, సమయస్ఫూర్తితో సమాధానం చెబుతానని ప్రమాణం చేయించారు. మీ చమత్కారం మీది మా సమయస్ఫూర్తి మాదని చంద్రబాబు అన్నారు. బాలకృష్ణ గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వగా ఇది కాదు సాయంత్రం చెక్ పంపించాలని చంద్రబాబు అన్నారు.

 

జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకున్నాను. గతంలో అన్ స్టాపబుల్‌కు రావడానికి, ఇప్పుడు ఇక్కడికి మధ్యలో చాలా జరిగాయి. ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని నిలబెట్టాలని.. గెలిచిన తరువాత మీ ముందుకు మళ్లీ వచ్చాను. మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను అన్‌స్టాపబుల్ 4లో ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లతో పాటు టీడీపీ శ్రేణుల నిరసనల్ని చూపించారు. చంద్రబాబు అరెస్ట్ అమానుష ఘటన అని బాలకృష్ణ అభివర్ణించారు. 


జరగకూడని ఘటన మీ అరెస్ట్ పై మీరు ఏం అనుకుంటున్నారు?

చంద్రబాబు: అప్పుడు కలిగిన బాధ, ఆవేదన, ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను (భావోద్వేగం). నంద్యాలలో మీటింగ్ పెట్టాం. అటు నుంచి బస్సు వద్దకు వచ్చి బస చేశా. ఆ రాత్రి మొత్తం బయట గందరగోళంగా ఉంది. తెల్లవారుజామున కిందకి రాగానే ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తారని పోలీసులను ప్రశ్నించాను. ముందుగా అరెస్ట్ వారెంట్ ఇస్తున్నాం. తరువాత నోటీసులు ఇస్తామన్నారు పోలీసులు. ప్రజాస్వామ్యంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్య దేశంలో చిన్న తప్పు చేసిన వ్యక్తికి సైతం వాళ్లు చేసింది చెబుతారు. వాళ్ల సమాధానం తీసుకుని పరిశీలించి, అది తీవ్రమైన విషయం అనుకుంటేనే అరెస్ట్ చేస్తారు.



ఆరోజు ఉదయం నన్ను అరెస్ట్ చేశారు. విచారణాధికారికి బదులుగా మరో అధికారి వచ్చారు. మీరు ఎందుకు వచ్చారని అడిగితే తాను సూపర్ వైజర్ అని చెప్పారు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నట్లు ఆరోజు వ్యవహరించారు. నా జీవితంలో ఏ తప్పు చేయలేదు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి పనిచేశాను. ఎవర్నీ తప్పు చేయనివ్వలేదు. ఆరోజు జరిగిన సంఘటనను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. రాష్ట్రంతో పాటు దేశమంతా ఆ అమానుష ఘనను చూసింది. నేను ఏరోజు తప్పు చేయలేదు. నిప్పులా బతికాను. ప్రజలు నన్ను తప్పు పట్టరని, నమ్ముతారనుకున్న. తరువాత అదే జరిగి నన్ను గెలిపించారు.


అరెస్ట్ సమయంలో, ఆ క్షణంలో మీ మనసులో ఏం అనిపించింది?
చంద్రబాబు: మనిషిగా పుట్టాక ఎన్నో పనులు చేస్తుంటాం. కానీ ఇలా అరెస్టులు చేస్తారనో, ప్రాణం పోతుందనో భయం ఉంటే ఏ పనులు చేయలేం. అది ఎప్పటికీ నా మనసులో ఉంటుంది.


సూర్యుడ్ని అరచేతితో అడ్డుకుంటామన్నట్లు వ్యవహరించారు. కళంకం అద్దాలని చూశారు. ఆ రాజకీయ వైరాన్ని ఎలా చూస్తారు? 
చంద్రబాబు: నేను సీఎంగా ఉన్న సమయంలో వైఎస్సార్ కొన్నిసార్లు గొడవలు చేసినా, రెచ్చిపోయినా నేను మాత్రం సంయమనం పాటించాను. తరువాత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నేను ప్రతిపక్షనేతగా ఉన్నాను. అప్పుడు కూడా వైఎస్సార్ దూకుడుగా వ్యవహరిస్తే నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఆయన దిగొచ్చి క్షమాపణ చెప్పారు. నేను తప్పు చేయను. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టను . ఈ విషయంలో క్లియర్ గా ఉన్నాను.




నా అరెస్టుపై మీరు ఎలా స్పందించారని బాలకృష్ణను చంద్రబాబు ప్రశ్న?
బాలకృష్ణ: ఆరోజు ఫోన్ వచ్చింది, విషయం తెలియగానే ఒక్కసారిగా షేకయ్యాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎక్కడికక్కడ మొత్తం బ్లాక్ చేశారు. ఆ తరువాత పార్టీ వాళ్లకు లోకేష్ బాబుకు ఫోన్ చేశాను. ఏం తెలియని అమోయ పరిస్థితుల్లో ఉన్నాను. మిమ్మల్ని టచ్ చేశారంటే పార్టీలకు అతీతంగా స్పందించారు. ఆ అమానుషాన్ని కూకటివేళ్లతో సహా పీకేశారు


పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించారు. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఓ ప్రజా నాయకుడు అరెస్ట్ అయితే ప్రజలు ఎంతలా స్పందిస్తారో ఆ ఘటన నిరూపించిందన్నారు చంద్రబాబు. తాను కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేదన్నారు. తెలుగు వారు బాగుపడాలి, దేశం కోసం ఏమైనా చేయాలనే తపన పడుతుంటానన్నారు. 53 రోజుల తరువాత నా ప్రజల్ని మళ్లీ చూడకగలిగా అన్నారు.