Ponguleti Srinivas Reddy says Indiramma houses for poor people as Diwali gift | హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ కానుకగా ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మొదటి విడత పంపిణీ ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి అనేది అమావాస్య రోజున వస్తుంది కనుక తరువాత మంచిరోజు చూసుకుని తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్​లో ఉన్న డీఏలలో ఒకటి తక్షణమే రిలీజ్ చేయడానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 317 జీవో విషయంలోనూ స్పౌజ్, హెల్త్, మ్యూచువల్​బదిలీలను వెంటనే అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. 


తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక 
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. అర్హులైన పేదలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనుందని తెలిపారు. దీపావళి తరువాత ఓ మంచిరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి శ్రీకారం చుడతామని పొంగులేటి తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికకు ఏర్పాటు చేసే ఇందిరమ్మ కమిటీలు అర్హులైన లబ్దిదారుల జాబితా రూపొందించి, ప్రత్యేక యాప్ లో వివరాలు నమోదు చేస్తారని వెల్లడించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.  


నవంబర్ నెలాఖరుకు కుల గణన పూర్తి


స్థానికత విషయంలో 317 జీవో, కొత్త ఉద్యోగాల భర్తీపై 46 జీవోపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించిన తరువాత తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని మంత్రి పొంగులేటి చెప్పారు. స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది కనుక న్యాయసలహా ముందుగా న్యాయసలహా తీసుకుంటాం. తరువాత అసెంబ్లీలో చర్చించి కేంద్రానికి ప్రతిపాదన చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.కులగణన (Caste Census)కు సంబంధించి అడగడానికి రూపొందించిన ప్రశ్నలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 4, లేక 5న ప్రారంభించి నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ కు, కొత్త రోడ్ల నిర్మాణానికి, రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.



 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐ5 డీఏలు పెండింగ్‌లో ఉండగా, వాటిలో తక్షణమే ఒక డీఏ ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవగానే పెండింగ్ డీఏలు అన్నీ క్లియర్‌ చేస్తామని, ప్రస్తుతానికి ఈ డీఏను ఉద్యోగ సంఘాలు సంతోషంగా స్వీకరించాలన్నారు.


 తెలంగాణ కేబినెట్ మరిన్ని నిర్ణయాలు
నవంబరు 4 నుంచి 19 వరకూ రాష్ట్రంలో కుల గణన సర్వే. 80వేల ఎన్యూమరేటర్లకు త్వరలో శిక్షణ ఇస్తారు. అక్టోబర్ 28 నుంచి జిల్లా కలెక్టర్ల సమావేశంతో శిక్షణ ప్రారంభం కానుంది. ఒక్కో ఎన్యూమరేటర్‌ నిర్ణీత గడువు లోగా 150 ఇళ్లకు వెళ్లి ప్రశ్నావళితో వివరాలు సేకరిస్తారు. 
 - ధాన్యం సేకరణకు సుమారు 6వేలకు పైగా కేంద్రాలు అవసరం ఉండగా.. ఇదివరకే కొన్ని ఏర్పాటు చేశారు. త్వరలో మరికొన్ని కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో రైస్‌మిల్లర్ల దగ్గర మిగిలిపోయిన రూ.20 వేల కోట్ల ధాన్యం ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఏం చేశారో పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
- హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణ డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్‌- శంషాబాద్, ఎంజీబీఎస్‌- చాంద్రాయణగుట్ట, రాయదుర్గం- కోకాపేట్, ఎల్‌బీనగర్‌- హయత్‌నగర్‌, మియాపూర్‌- పటాన్‌చెరు మొత్తం 76.4 కి.మీ. విస్తరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నాయి 
- ములుగు గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల కేటాయింపు, యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గచ్చిబౌలి స్టేడియాన్ని ఈ యూనివర్సిటీకి వినియోగించనున్నారు. 
- ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి గోషామహల్‌లో స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీస్‌ శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. 
- తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC)కు కొత్తగా 142 పోస్టులను మంజూరు చేయాలని మంత్రివర్గం భావిస్తోంది.
- రెండు కాలేజీలకు, కొత్త కోర్టులకు సిబ్బంది మంజూరుకు ఆమోదం తెలిపింది.
- స్కిల్స్‌ యూనివర్సిటీకి అనుబంధంగా మధిర, హుజూర్‌నగర్‌, వికారాబాద్ ఐటీఐలను కొత్తగా మంజూరు చేసింది. 
-  రిజర్వాయర్లలో పూడిక పైలట్‌ ప్రాజెక్టుగా కడెం ప్రాజెక్టులో పూడిక తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మధ్యతరహా, భారీ ప్రాజెక్టుల్లో ప్రక్రియను చేపడతారు.