Rains In Andhra Pradesh News | అమరావతి/ హైదరాబాద్: దానా తుఫాను తన దిశను మార్చుకోవడంతో ఏపీపై అంతగా ప్రభావం చూపలేదు. అయితే దానా తుఫాను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. దక్షిణాదిన చూస్తే కర్ణాటక, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఉత్తర ఒడిశాలో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 6 గంటల్లో ఇది మరింత బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానం మీదుగా వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తీవ్రమైన తుఫాను దానా గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య ద్విగా కదిలి ఉత్తర తీర ఒడిశాలో తుఫాను బలహీనపడింది. ఆ సమయలో తీరం వెంట 80 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీచాయి. 


ఏపీలో మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల చిరు జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. 






తెలంగాణలో ఉక్కపోత, ఆ జిల్లాల్లో భానుడి ప్రతాపం
తెలంగాణలో మరో రెండు రోజులాపాటు వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 29 నుంచి రెండు, మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం అయితే తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది. అత్యధికంగా ఖమ్మంలో 35 డిగ్రీల అధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 34 డిగ్రీలుగా  నమోదైంది. నిజామాబాద్ లో 33.5 డిగ్రీలు, రామగుండం, మెదక్ లలో 33 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ ప్రాంతాల ప్రజలు వర్షాకాలం, చలికాలంలో ఉన్నామా లేక వేసవి వచ్చేసిందా అన్నట్లు ఫీలవుతున్నారు. పగటి పూట ఎండలు, మరోవైపు వేడి గాలులకు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. 






హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదు కాగా, రాత్రిపూట 20 డిగ్రీలకు పడిపోయింది. రాష్ట్రంలో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు మహబూబ్ నగర్ లో 29 డిగ్రీలు నమోదు కాగా, 30 కంటే తక్కువ డిగ్రీలు నమోదైన ఏకైక ఉమ్మడి జిల్లాగా పాలమూరు నిలిచింది. దానా తుపాను ముప్పు పూర్తిగా తప్పింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తుపాను ప్రభావం నుంచి కోలుకుంటున్నాయి. 


Also Read: Indiramma Houses APP: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి