Telangana housing scheme app for Indiramma houses to be launched soon | హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇదివరకే యాప్ రెడీ అయిందని, త్వరలోనే యాప్ ను పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన ఈ యాప్ తెలుగు వెర్షన్ ఉండేలా చూస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma houses Scheme) ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న మంత్రి
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, పేదలకు ఇండ్లు లాంటి అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆ యాప్ లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. ఇందులో కులం, ప్రాంతం, మతం, పార్టీ లాంటి ఏ రాజకీయ, మత విషయాలు పట్టించుకోకుండా అర్హులైన అందరకీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చి న్యాయం చేస్తుందని పేర్కొన్నారు.
త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల యాప్ లాంచింగ్
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని పేదవారికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. దీనికోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అర్హుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల వారితో పాటు గ్రామీణ ప్రాంతాల వారికి అర్థమయ్యేలా తెలుగు వర్షన్ లో యాప్ తీసుకొస్తాం, ఏ ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం చేశారు. తాను సూచించిన మార్పులు పూర్తయ్యాక, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక యాప్ త్వరలోనే లాంచ్ చేస్తామన్నారు.
నియోజకవర్గం చొప్పున లబ్దిదారుల ఎంపిక
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4000 చొప్పున నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నారు. వచ్చే నాలుగేళ్లలో పేదలకు 20 లక్షల ఇండ్లు కట్టించి ఇస్తామని పొంగులేటి ఇటీవల తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ వ్యాప్తంగా 4.16 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటిదశలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని రోజుల కిందట ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేస్తారని తెలిసిందే. ఆ కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారనేది కూడా ఆదేశాలలో పేర్కొన్నారు.