DGP Serious On Battalion Constables Portest: తెలంగాణలో ఏక్ పోలీసింగ్ (Telangana Policing) విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసనలు ఆందోళన కలిగిస్తోన్న క్రమంలో దీనిపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. క్రమశిక్షణతో కూడిన పోలీస్ శాఖలో ఉంటూ ఇలా ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలకు దిగడం సరికాదన్నారు. ఈ నిరసనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్నారు. ఎంతోకాలంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ సజావుగా సాగుతోందని.. మన దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. పోలీసులు ఆందోళన చేయడం క్రమిశిక్షణ ఉల్లంఘనేనని అన్నారు.
The Police Forces (Restriction of Rights) Act, The Police (Incitement to Disaffection) Act, Police Manual ప్రకారం పోలీసులు విధులు బహిష్కరించడం, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన చర్యగా బావిస్తున్నామని అన్నారు. దీన్ని ఎట్టపరిస్థితుల్లోనూ ఉపేక్షించమని.. ఆందోళన చేస్తున్న వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ వివాదం
తెలంగాణ వ్యాప్తంగా ఒకే పోలీసు విధానం అమలు చేయాలంటూ 4 రోజుల క్రితం కొంతమంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలు ధర్నాకు దిగారు. సెలవులు ఇవ్వడం లేదని.. కుటుంబాలకు వారు తోడు లేకుండా చేస్తున్నారని ఆందోళన చేశారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. ఇందులో ఆ కానిస్టేబుళ్ల హస్తం ఉందని ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. అయితే, ఈ డిమాండ్ అనూహ్యంగా ఊపందకుంది. ఏకంగా కానిస్టేబుళ్లే రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగారు. నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబుపై కానిస్టేబుళ్లు తిరుగుబాటు చేశారు. ఆయన వెళ్లిపోయే వరకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అటు, నల్గొండలో మొదలైన వివాదం కరీంనగర్, వరంగల్ ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కానిస్టేబుళ్లు రోడ్డెక్కారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్‌ను ఉన్నతాధికారులు ఎత్తేశారు. అసలు టీజీఎస్పీ కానిస్టేబుళ్లను ఎవరు పెళ్లి చేసుకోవాలని ఎస్సై సైదాబాబు అన్నారని కానిస్టేబుళ్ల భార్యలు ఆరోపించారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కొన్నిచోట్ల కానిస్టేబుళ్ల కుటుంబాలు సైతం ధర్నాలో పాల్గొని వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలంటూ వారి పిల్లలు సైతం ఫ్లకార్డులతో ప్రదర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు ధర్నాకు దిగాయి. మరోవైపు, ఈ ధర్నాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నాయి.