Chandrababu Arrest: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీలోని అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నారు. బాబు అవినీతికి పాల్పడినందుకే అరెస్ట్ అయ్యారని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లేకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది దుర్మార్గమని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నేతలు గత కొద్దిరోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ర్యాలీలు, కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శన, నిరవధిక నిరహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
ఇక బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తుండగా.. వైసీపీ బహిష్కృత నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై నెల్లూరు జిల్లాకు చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ నేలమట్టమైందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అంటూ జోస్యం చెప్పారు. కాబోయే సీఎం చంద్రబాబే అని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఈ అరెస్ట్ వల్ల వైసీపీకి నష్టమే కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.
మరో ఐదారుసార్లు జగన్ సీఎం అవుతారని తాను గతంలో అనుకున్నానని, కానీ ఒకే ఒక్క ఛాన్స్‌తో ఆయన రాజకీయం జీవితం స్మాష్ అయిందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. న్యాయంగా ఎన్నికలు జరిగితే వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. పైశాచిక ఆనందం కోసమే బాబును జగన్ జైల్లో పెట్టారని విమర్శించారు. ఎలాంటి తప్పుచేయకపోయినా చంద్రబాబు పట్ల జగన్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, దీని వల్ల ఆయనకు ప్రజల్లో సానుభూతి వస్తుందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 30 సంవత్సరాలు కష్టపడి సీఎంగా అయ్యారని, ఆయన పేరు వాడుకుని స్వార్థం కోసం జగన్ సీఎం అయ్యారని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే ఈ సందర్భంగా తనను పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేయడంపై చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. తన అన్న రాజమోహన్ రెడ్డి వల్లే తనను వైసీపీ నుంచి బయటకు పంపించారని, ఆయన వల్లే సస్పెండ్ చేశారని వ్యాఖ్యానించారు. అయితే రెండు రోజుల క్రితం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఇప్పటికే టీడీపీలో చేరాల్సింది ఉందని, కానీ చంద్రబాబు అరెస్ట్ కావడంతో చేరిక ఆగిపోయినట్లు చెప్పారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో పార్టీలో చేరతానన్నారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆ పార్టీలోనే చేరుతానని అన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని వినాయకుడికి పూజలు చేస్తున్నానని, త్వరలోనే బెయిల్‌పై బయటకొస్తారనే నమ్మకం ఉందన్నారు. కడిగిన ముత్యంలా బాబు జైలు నుంచి బయటకొస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లి ఉండకపోతే ఇప్పటికే టీడీపీలో చేరి ఉండేవాడినని, ఉదయగిరి టీడీపీ టికెట్ ఇస్తే గెలుస్తానని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.