Tuni TDP : కాకినాడ జిల్లా తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు తలెత్తినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తుని టీడీపీ సీటు తన కూతురుకి ఇస్తున్నారని సంకేతాలు ఇచ్చిన యనమల రామకృష్ణుడుపై ఆయన తమ్ముడు కృష్ణుడు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తుని టీడీపీ ఇన్చార్జ్ యనమల కృష్ణుడు, తొండంగి టీడీపీ నేత మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ వైరల్ అవుతోంది. 


ఫోన్ కాల్ లో వ్యాఖ్యలు 


"యాదవ సామాజికవర్గంలో 30 వేల ఓట్లు ఉన్నాయి, నేను లేకపోతే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఇంట్లో ఉంటుంది. ఈసారి సీటు యనమల కృష్ణుడికి ఇవ్వక్కర్లేదు కానీ నా కూతురికి ఇవ్వనని రామకృష్ణుడిని చెప్పమనండి. ఈసారి వైసీపీ  రాజా నెగ్గేస్తున్నాడని అందరూ అంటున్నారు. కృష్ణుడు కష్టపడితే కూతురుకు సీటు ఇస్తారా అని అడగండి. ఊరికి 40 మంది కలిసి వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని యనమల రామకృష్ణుడుకి గట్టిగా చెప్పండి."   అని యనమల కృష్ణుడు మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంంది. 


ఇద్దరి మధ్య ఫోను సంభాషణ 



  • యనమల సోదరుడు : యాదవ సంఘంలో 30 వేల ఓట్లు, చావైనా, బతుకైనా అన్ని నేను చూస్తున్నాను. కరోనా సమయంలో కూడా అందరినీ ఆదుకున్నాను. ఆయన కూతురు ఇంట్లో కూర్చొంటుంది. 

  • టీడీపీ నేత : మీతో స్థాయి మాతో లేదు కానీ మా గురువు గారికి సీటు ఇవ్వకుండా వేరొకరి సీటు ఇవ్వడం సరికాదని ఆయనను అడుగుతామండి. 

  • యనమల సోదరుడు : ఇందుకు ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడేం అయిపోలేదు కాదా అంటున్నారు. కానీ మీ పాపను పెట్టుకుంటున్నారని అందరికీ తెలిసిపోయిందనండి. 

  • టీడీపీ నేత : వైఎస్సార్ వాళ్లు కూడా పొంగిపోతున్నారండి సీటు కృష్ణ గారికి ఇవ్వడంలేదండి. సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మా పార్టీ వాళ్లు గెలుస్తారంటున్నారని చెప్తానండి. 

  • యనమల సోదరుడు : ఇన్నాళ్లు కృష్ణ గారు కష్టపడితే సీటు మీ కుమార్తెకు ఇస్తారా అని అడగండి. 13 సంవత్సరాలు కష్టపడిన వాళ్లకు సీటు ఇవ్వరా అని నిలదీయండి

  • టీడీపీ నేత : ఊరికి 40 మంది కుర్రోళ్లను తీసుకుని వెళ్లి ఆయనను కలుస్తామండి. కృష్ణ గారి సీటు ఇవ్వాలని అడుగుతామండి. కృష్ణ గారు గెలిచినా గెలవకపోయినా ఆయన ప్రభావం పార్టీలో ఉంది. 

  • యనమల సోదరుడు : వైసీపీ వాళ్లు మనవైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటప్పుడు సీటు ఇవ్వకపోతే పార్టీకే నష్టం జరుగుతుందన్నట్లు మాట్లాడండి

  • టీడీపీ నేత : అంతేనండి రేపు మాట్లాడతాం. కృష్ణ గారికి సీటు ఇవ్వకపోతే పెద్ద గొడవే అవుతుందండి. 


 యనమల కృష్ణుడు మాట్లాడినట్లు ఉన్న ఫోన్‌‌ కాల్ సంభాషణ వైరల్ అవుతోంది. దీంతో పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీ కార్యకర్తలు కొందరు తప్పుడు ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై యనమల కృష్ణుడు ఏంచెబుతారో చూడాల్సి ఉంది.