ICICI Bank Loan Case: ఐసీఐసీఐ బ్యాంకు మోసం కేసులో వీడియోకాన్ ఛైర్మన్ (Videocon Chairman) వేణుగోపాల్ ధూత్‌ను (Venugopal Dhoot) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం అరెస్టు చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను ఏజెన్సీ శుక్రవారం అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు బ్యాంక్ మంజూరు చేసిన రుణాలలో మోసం, అవకతవకలకు సంబంధించి వారిని శనివారం ముంబయి ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు.
నో ఆన్సర్స్
వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు నమోదైన కేసులో సీబీఐ విచారణ జరపుతోంది. ఇందులో భాగంగానే కొచ్చర్ దంపతులను అదుపులోకి తీసుకుంది. విచారణ సమయంలో ఇద్దరూ తమ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని, సరిగా కో ఆపరేట్ చేయలేదని CBI చెబుతోంది. అందుకే పోలీస్ కస్టడీలో ఉంచాలని స్పెషల్ సీబీఐ కోర్టుని కోరారు అధికారులు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ కేసు
వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా 2018లో చందా కొచ్చర్ వైదొలిగారు. 2012లో బ్యాంకు సీఈవో హోదాలో చందా కొచ్చర్ ₹ 3,250 కోట్ల రుణం మంజూరు చేయగా.. అది ఎన్‌పీఏగా మారడంతో తద్వారా ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. కేవలం వీడియోకాన్ గ్రూప్‌ను ప్రమోట్ చేసేందుకు...గుడ్డిగా రుణాలు ఇచ్చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇందుకు బదులుగా దీపక్ కొచ్చర్ కంపెనీలో వీడియోకాన్ గ్రూప్ కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని చెప్పింది.
2012లో ICICI బ్యాంక్ వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చింది. అది చివరకు నిరర్థక ఆస్తిగా మిగిలిపోయింది. 2018లో చందాకొచ్చర్‌పై ఆరోపణలు వచ్చాయి. రుణాలివ్వడంలో అవకతవకలకు పాల్పడ్డారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఫలితంగా...వెంటనే ఆమె సీఈవో, ఎండీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఈ కేసు గురించి సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
Also Read: Shraddha Murder Case: సీబీఐ ఆఫీసుకు అఫ్తాబ్- వాయిస్ శాంప్లింగ్ టెస్ట్ కోసం తరలింపు!