Top Telugu Headlines Today 04 July 2023: 
 ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు - రాజీనామా చేయాలని సోము వీర్రాజుకు హైకమాండ్ నుంచి ఆదేశం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సోము వీర్రాజుకు బీజేపీ హైకమాండ్ ఆదేశించింది.   నేరుగా సోము వీర్రాజుకు ఫోన్ చేసిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మీ పదవి కాలం పూర్తయినందున తప్పించాలని నిర్ణయం తీసుకున్నామని.. రాజీనామా చేయాలని సూచించారు.   దీంతో ఏపీ బీజేపీకి రెండు రోజుల్లో కొత్త అధ్యక్షుడ్ని నియమించే అవకాశం ఉంది.  తనకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారని..  కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారని సోము వీర్రాజు మీడియాకు తెలిపారు.  వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యేలా పార్టీని , ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసేలా బీజేపీ హైకమాండ్ కొద్ది రోజులుగా విస్తృత మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలో పలువురు బీజేపీ పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించుకుంది.  పూర్తి వివరాలు  


మళ్లీ వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుందన్న రఘురామ వీడియో వైరల్ - రెబల్ ఎంపీ మారిపోయారా ? ట్విస్ట్ ఉందా ?
వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మళ్లీ సీఎం జగన్ గెలుస్తారంటూ మాట్లాడిన ఓ వీడియోను.. వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రఘురామకృష్ణరాజు అక్కడే ఈ మాటలు మాట్లాడారని అంటున్నారు. ఆ వీడియోలో ఏముందంటే ?.. సీఎం  జగన్ అన్ని హామీలను నెరవేర్చారని..  వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తారని రఘురామకృష్ణరాజు ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పడే ఓట్ల శాతం పెరుగుతుందని, మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఈ వీడియోలో చెప్పారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ప్రసంసలు కురిపించారు.  పూర్తి వివరాలు   


బండి సంజయ్‌కు మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్‌- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై 48 గంటల్లో నిర్ణయం!
తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై అధినాయకత్వం మరోసారి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్‌ను ఢిల్లీ పిలిచి మాట్లాడిన హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సైలెంట్‌గా పరిస్థితులు గమనిస్తోంది. బండి సంజయ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు గట్టిగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకొచ్చింది బండి సంజయ్‌. ఈ విషయాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరిని అడిగినా చెప్తారు. అదే టైంలో పార్టీలో వర్గాలు కూడా ఎక్కువ అయ్యాయి అనేది కఠోర సత్యం. దీని ఫలితంగానే బండి సంజయ్‌ మార్పు ఖాయమని చాలా మంది అనుకున్నారు.  పూర్తి వివరాలు   


సహకార డెయిరీలను నట్టేట ముంచుతున్నారు, సీఎం జగన్‌ లోకేష్‌ ఫైర్
రాష్ట్రంలోని సహకార డెయిరీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి అప్పనంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. పాడి రైతుల సంక్షేమానికి తూట్లు పోడిచేలా ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారని విరుచుపడ్డారు. అమూల్‌కు జగన్ మోహన్ రెడ్డి దాసోహమయ్యారని ఆరోపించారు. 1990వ దశకం ప్రారంభంలో అతిపెద్ద పాల కేంద్రాలలో ఒకటైన చిత్తూరు డెయిరీ నష్టాల కారణంగా మూతపడిందని నారా లోకేష్ గుర్తు చేశారు. 2005లో అప్పటి దివంగత సీఎం రాజశేఖర్‌ రెడ్డి ఏర్పాటు చేసిన హౌస్‌ కమిటీ విచారణ జరిపి నష్టాల వల్లే డెయిరీ మూత పడిందని తేల్చిందన్నారు.  పూర్తి వివరాలు