Tirpati News | తిరుపతి: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు వివాదాస్పదం అవుతున్నాయి. ఎన్నికల్లో పాల్గొనాల్సిన వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బంధిస్తున్నారని వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరులోని ఓ ప్రైవేట్ హోటల్ లో వైసీపీ కార్పొరేటర్లను బంధించారంటూ భూమన అభినయ్ రెడ్డి (Bhumana Abhinay Reddy) ఓ వీడియో విడుదల చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని, తాము చెప్పిన వారికి మద్దతివ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
హాటల్‌లో వైసీపీ కార్పొరేటర్లు!
జనసేన ఎమ్మెల్యే కుమారుడు ఆరని మదన్ ఆదివారం అర్ధరాత్రి వైస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి చిత్తూరుకు తరలించారని సంచలన విషయాలు వెల్లడించారు. వైస్సార్సీపీ కార్పొరేటర్లను బలవంతంగా అక్కడ ఎందుకు ఉంచారని, ఆ ప్రైవేట్ ప్రాంతం నుంచి వారిని పంపాలని కోరారు. వారిని అడ్డుకునేందుకు కూటమి నేతలు యత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి వచ్చి అంతా కంట్రోల్ చేశారు. కొంత సమయం తరువాత వైసీపీ కార్పొరేటర్లు అక్కడి నుంచి వెనుతిరిగారు.
నోటీసులు లేకుండా అరెస్టులా..
వైసీపీ కార్పొరేటర్ రాజేష్ ను ఎలాంటి నోటీసులు లేకుండా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారని వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. సురేష్ అరెస్ట్ గురించి తెలుసుకున్న అభినయ్ రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వైసీపీ కార్పొరేటర్ రాజేష్ ను బయటకు పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ కార్పొరేటర్లను రానివ్వకుండా ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తున్నారని ఆరోపించారు.
సోమవారం ఉదయం 11 గంటలకు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వైసీపీ కార్పొరేటర్లను ఓటింగ్ లో పాల్గొనకుండా చేసేందుకు అర్ధరాత్రి వారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా హోటల్ కు తరలించారని భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. హోటల్ బయట కారు అడ్డుపెట్టి, మనుషులను పెట్టి వైసీపీ నేతల్ని భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. వారిని విడిపించేందుకు వెళ్లగా తనను సైతం కూటమి నేతలు, వారి మనుషులు అడ్డుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్, టీడీపీ నేతలు జేబీ శ్రీనివాసులు, టౌన్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ, కృష్ణా యాదవ్ హోటల్ వద్దకు వచ్చి తమను అడ్డుకోగా.. పోలీసులు రావడంతో వెనక్కి తగ్గారని భూమన అభినయ్ రెడ్డి వెల్లడించారు.