ఢిల్లీ: ఏపీలో వైఎస్ జగన్ రుషికొండ ప్యాలెస్‌లా, ఢిల్లీలో కేజ్రీవాల్ శేషమహల్ నిర్మించారని.. ప్యాలెస్‌లు కట్టుకునేవారిని కాకుండా, ప్రజల కోసం పనిచేసే నేతలకు ఓటేయాలని చంద్రబాబు అన్నారు. ‘ఆమ్ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోయింది. దేశమంతా స్వచ్ఛ భారత్‌లో దూసుకెళ్తుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంలోకి వెళ్తోంది. ఇక్కడ వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ ఉంది. 1995లో హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఉంది. జీవన ప్రమాణాలు పెరగాలంటే ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకోవాలంటే మోదీ అనే ఆక్సిజన్ అవసరం’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు. ‘బీజేపీ(BJP) గెలుపులో తెలుగువారు భాగమవ్వాలి. ఢిల్లీలో తెలుగువారు ఇంతమంది ఉంటారని అనుకోలేదు. ఢిల్లీలో స్థిరపడ్డ ప్రతి తెలుగు ఓటరు బీజేపీకి ఓటు వేయాలి. పెట్టుబడుల కోసం ఇటీవల దావోస్ వెళ్లినప్పుడు అక్కడ మనవాళ్లు 650 మంది ఉన్నారు. ప్రధాని మోదీ ఏఐ, గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు. 1995లో ఐటీ అన్నాం. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. బీజేపీ గెలుపు.. దేశ చరిత్రకే ఒక మలుపు అని తెలుగు తమ్ముళ్లు ఇంటింటికి వెళ్లి చెప్పాలి. ఐటీలో భారతీయులను ఢీకొట్టే వాళ్లు లేరు.

మన దేశ బ్రాండ్ మోదీ
సరైన సమయంలో మన దేశానికి సరైన నేత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. భారత్ అనే బ్రాండ్ మార్మోగడానికి కారణం ప్రధాని మోదీ. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణల్లో శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వికసిత్ భారత్ లో భాగంగా 2047 కల్లా భారత్ నెంబర్ వన్ అవుతుంది. ఢిల్లీని చూస్తే చాలా బాధ కలుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చి ఉండుంటే న్యూయార్క్, వాషింగ్టన్‌లను ఢిల్లీ తలదన్నేది. ఉద్యోగాల కోసం ఢిల్లీకి రావడానికి బదులుగా ఇక్కడి నుంచి చాలామంది హైదరాబాద్, బెంగళూరు వైపు చూస్తున్నారు.
బీజేపీ గెలిస్తేనే సంక్షేమం
ఢిల్లీ మురికికూపంగా మారింది. సరైన పైపులైన్లు లేక తాగునీరు కలుషితం అవుతోంది. తాగునీరు కూడా అందించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైంది. పదేళ్లలో అభివృద్ధిపై ప్రశ్నిస్తే స్కూళ్లు పెట్టామని చెబుతున్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు జాబ్స్ కోసం వస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే ఢిల్లీలో బీజేపీ గెలవాలి. బీజేపీ గెలిస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్ధిక సాయం అందుతుంది. హోలీ, దీపావళి పండుగకు ప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ తో పాటు రూ.500కు ఎల్పీజీ సిలిండర్ అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్యం, వృధ్యాప్య పింఛన్లు రూ.2,500, వితంతువు, దివ్యాంగులకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ ఇస్తుంది. గరీబ్ కళ్యాణ యోజన కింద 5 కేజీల బియ్యం, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తుంది.
ప్యాలెస్‌లు కట్టుకునే వారు పాలకులుగా వద్దు
‘ఏపీలో విశాఖలో వైఎస్ జగన్ రుషికొండ ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్‌లోకి అడుగుపెట్టేలోపే ఎన్నికల ఫలితాలతో జగన్ ఇంటికి పరిమితమయ్యాడు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ శేషమహల్ కట్టారు. ఆ ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకముందే ఆప్‌ను, కేజ్రీవాల్‌ను చిత్తుగా ఓడించాలి. ప్యాలెస్‌లు కట్టుకునేవారిని కాదు, ప్రజల కోసం పనిచేసే వారిని గెలిపించండి. షహదారా ఎమ్మెల్యేగా సంజయ్ గోయల్‌ను గెలిపించండి. ఢిల్లీలో బీజేపీదే విజయం. ఒకప్పుడు సర్ధార్ వల్లాభాయ్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. అటువంటి గట్టి నేత మోదీ.
బీజేపీ అధికారంలో ఉండుంటే మోదీ నాయకత్వంలో ఢిల్లీ స్వచ్ఛంగా ఉంటుంది. యమునా నదిని శుద్ధి చేస్తానన్న కేజ్రీవాల్ పదేళ్లులో చేయనిది ఇప్పుడు చేస్తారా.? కేంద్రం గంగానది ప్రక్షాళన చేస్తోంది. యమునా నది శుద్ధి బీజేపీ సర్కార్ కే సాధ్యం. ఆప్ కేజ్రీవాల్ పాలనలో అభివృద్ధి లేదు, రోడ్లు గానీ, మౌలిక సదుపాయలు లేవు. గాలి కాలుష్యం దారుణంగా ఉంది. సుస్థిర పాలన, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని’ చంద్రబాబు అన్నారు.
Also Read: KL University: కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు, లంచం కేసులో 10 మంది అరెస్ట్!