ఒంటిపై నాగదేవత వాలుతుందని కష్టాలు అన్ని తొలగిస్తామని ఓ‌ కుటుంబాన్ని నమ్మించి మోసం చేసిందో మహిళ. నగలు, నగదు మాయం చేసేందుకు‌ ప్రయత్నించింది. మాయ లేడి మాయలో‌ నుంచి తేరుకున్న కుటుంబ సభ్యులు ఆఖరిలో మంత్రగత్తెకు చుక్కలు చూపించారు. 


తిరుపతి నగరంలోని కొర్లగుంట అబ్బన కాలనీకి చెందిన శివప్రసాద్ కుటుంబం నివాసం ఉంటోంది. శివప్రసాద్ టిటిడిలో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం ఇద్దరూ మహిళలు అబ్బన కాలనీలో తిరుగుతూ ఎవరికైన కష్టాలు ఉంటే తీరుస్తామని అరుస్తూ తిరిగారు. వీళ్లతో మాటలు కలిపిన శివప్రసాద్‌ ఇంట్లో మహిళలను నమ్మబలికారు. మరుసటి రోజు ఓ మహిళ అదే కాలనీలో తిరుగుతూ తమ ప్లాన్ వర్కౌట్‌ చేయడం స్టార్ట్ చేసింది.  


నాగదేవత తనపై వాలుతుంది. కష్టాలు అన్ని తీరుస్తానని చెప్పిందా మహిళ.  ఆ మాయ లేడీ మాటలను నమ్మిన శివప్రసాద్ కుటుంబ సభ్యులు ఈ ఉదయం తమ నివాసంలో ప్రత్యేక పూజలకు అంగీకరించారు. ఆ మంత్రగత్తె వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. ఈ క్రమంలో ఇంటిలో‌ని బంగారు‌ నగలు, వెండి ఆభరణాలు, ఐదు వేల రూపాయల నగదును తాను చేసే పూజలో ఉంచాలని చెప్పిందా మంత్రగత్తె. ఏదో జరుగుతుందని ఆశపడిన శివప్రసాద్ ఫ్యామిలీ... ఆ మంత్రగత్తె చెప్పిన విధంగానే ఇంట్లోని నగదు, నగలను ఓ బాక్స్‌లో ఉంచి పూజలు చేశారు.  


శివ ప్రసాద్ కుటుంబ సభ్యులను నమ్మించేందుకు పూజలు చేసిన మహిళ కొంతసేపటికి నగదు, నగలు ఉంచిన బాక్సులను ఎర్రటి వస్త్రంలో చుట్టింది. శివప్రసాద్ కుటుంబ సభ్యులకు తెలియకుండా తనతోపాటుగా తెచ్చుకున్న బాక్సులను ఆ స్థానంలో ఉంచింది. అటు తరువాత పూజ పూర్తైందని కుటుంబ సభ్యులందరూ ఆలయానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేసి వస్తే తమ కష్టాలంతా తొలగిపోతాయని నమ్మబలికింది.


ఆ మహిళ చెప్పిన మాటతో ఆలయానికి వెళ్లిన శివప్రసాద్ కుటుంబ సభ్యులు కొబ్బరి కాయ కొట్టి ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గర మంత్రగత్త లేకపోవడంతో అనుమానం వచ్చిన శివప్రసాద్ కుటుంబ సభ్యులు పూజలో ఉంచిన బాక్స్ తెరిచే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి ఆ బాక్సులు తెరుచుకోక పోవడంతో పగలగొట్టి బాక్సులను చూస్తే బియ్యం ఒక్క రూపాయి బిళ్ళ చూసి శివప్రసాద్ కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు.


వెంటనే పరిసర ప్రాంతాలను గాలించిన శివప్రసాద్ కుటుంబ సభ్యులు మహిళను పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమను మోసగించేందుకు ప్రయత్నించిన మహిళపై తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహిళలు అదుపులోకి తీసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు.