చిత్తూరు జిల్లా గంగవరం మండలం జర్రవారిపల్లె గ్రామంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. జర్రవారిపల్లె ప్రాథమికోన్నత పాఠశాల‌ను కీలపట్ల జెడ్పి పాఠశాలకు విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంంది. జర్రవారిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలకు తాళలు వేసి రోడ్డుపై బైఠాయించారు గ్రామస్తులు, విద్యార్థులు. 170 మంది విద్యార్ధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 


విద్యార్ధులు, గ్రామస్తులు ధర్నాతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వం అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థలకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు అంగీకరించలేదు. పాఠశాల విలీనంపై జిల్లా కలెక్టర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాంమని విద్యా శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. 


గ్రామస్థులు మాట్లాడుతూ.. మూడు కిలోమీటర్లలోపు ఉన్న ప్రభుత్వం పాఠశాలను విలీనం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. బడుగు బలహీన వర్గాలు, దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యార్ధుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలు ఆడుకుంటుందని వారు మండిపడ్డారు. నిత్యం గజరాజుల దాడులతో భయపడుతూ తమ పిల్లలను అటవీ మార్గంలో స్కూల్‌కి పంపలేమన్నారు. గత మాసంలో ఈ గ్రామం పొలిమేరల్లో మేకల మందపై చిరుత పులి దాడి చేయడంతో పగటి పూటే గ్రామం దాటలేని స్ధితిలో ఉన్నామని జర్రవారిపల్లె గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


విద్య విధానంలో నూతన ఒరవడి అంటూ ప్రభుత్వం చెపుతుంటే... బడిపిల్లలు  మాత్రం తమ ఊరిలోని స్కూల్ తరలించ వద్దంటూ తల్లిదండ్రులతో పాటు పిల్లలు రాస్తారోకో  చేసిన ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలంలో చోటుచేసుకుంది.


అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రధాన ద్వారం ముందు ముళ్ళకంచి వేసి విద్యార్థులు తల్లిదండ్రులుతో కలిసి నిరసన చేపట్టారు.
మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేపులపర్తి ఉన్నత పాఠశాలలో తమ పాఠశాలను విలినం చేశారని ఇలా అయితే తమ పిల్లలు ఎలా చదువుకుంటారని ఈ విషయంపై ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు తెలియజేసిన ప్రయోజనం లేదని ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.