Tirumala: కొన్ని షరతులు పెట్టి రాష్ట్రపతి ఎన్నికలకు సీఎం జగన్ మద్దతు పలికి ఉంటే బాగుండేదని మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్న రాజప్ప అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన (జూలై 5) వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. తర్వాత స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 


దర్శనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు భక్తులు అధికమవుతున్న నేపథ్యంలో భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారికి వచ్చే ఆదాయాన్ని ఇతర కార్యక్రమాలకు కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని ఆయన కోరారు. భీమవరం బహిరంగ సభలో రాష్ట్రానికి కావాల్సిన హామీలను ప్రధాని ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవని అన్నారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో కొన్ని డిమాండ్స్ పెట్టి బీజేపీకి ఏపీ సీఎం మద్దతు పలికి ఉంటే బాగుండేదని అవేం లేకుండా ఫ్రీగా మద్దతు పలకడంతో ప్రధాని ఎలాంటి హామీలు ఇవ్వకుండా వెనుదిరిగారని మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్నరాజప్ప తెలిపారు.


బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే ఆ నిధులు: ఎంపీ
బీజేపీకి వైఎస్ఆర్ సీపీ సపోర్ట్ చేస్తున్న కారణంగానే ఏపీకి రావాల్సిన నిధులు వస్తున్నాయని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 700 నుండి 1400 సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీకాళహస్తి, అరుణాచలం, తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 


ప్రతి పేదవాడి ఆకలి గుర్తించి సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకు వచ్చారని అన్నారు. ప్రత్యేక హోదా వద్దు అని గత సీఎం చంద్రబాబు చెప్పి సంతకాలు చేసినప్పటికీ అందుకు భిన్నంగా నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ కి కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు.