- ఈ నెల 5 న ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు
 - ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు.
- కల్యాణ వేదిక సమీపం నుండి కడప మార్గంలో 10 చోట్ల, సాలాబాద్ వద్ద 5 ప్రదేశాల్లో ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు.
- వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలి. 
- జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ విజ్ఞప్తి


వై.ఎస్.ఆర్ జిల్లా... ఈ నెల 5 న (బుధవారం) ఒంటిమిట్ట లో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్.పి పత్రికా ప్రకటన విడుదల చేశారు. మళ్ళింపు ఈ నెల 5 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి అమలులో ఉంటుందని ఎస్.పి తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలు అనుమతించరని ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు.


వాహనాల దారి మళ్లింపు వివరాలు ఇలా ఉన్నాయి..
- కడప నుండి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లి ఇర్కాన్ జంక్షన్ నుండి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్ళాలి.
- తిరుపతి నుండి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుండి దారి మళ్లింపు ..వయా రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి.
- రాజంపేట వైపు నుండి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు.
- రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ నుండి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా దారి మళ్లింపు.
- 15 చోట్ల పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు
- రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలను సాలాబాద్ సమీపంలో 5 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి.
కల్యాణ వేదిక నుండి కడప మార్గంలో 10  పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు.


ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఏప్రిల్ 5న బుధవారం శ్రీ సీతారాముల క‌ల్యాణం జరుగనుంది. కల్యాణవేదిక వద్ద రాత్రి 8 నుండి 10 గంటల వరకు కల్యాణం నిర్వ‌హిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.


కల్యాణోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కలిసి శ్రీరామ నామామృతం భజన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దుబాల పర్యవేక్షణలో శ్రీరామకృతులు నృత్య కార్యక్రమం నిర్వహిస్తారు.


అదేవిధంగా కాంతకోరిక నిర్వహిస్తారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలుసుకోవడాన్ని కాంతకోరిక అంటారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం చేపడతారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.


ఏపీ సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంటిమిట్ట పర్యటన రద్దు అయింది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు జగన్ హాజరు కావాల్సి ఉంది. అయితే కాలి నొప్పి కారణంగా సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచించడంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దుచేసినట్లు తెలుస్తోంది.