Aanivari Mahotsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థాన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్య కాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో.. ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభం అయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు. 


సర్వభూపాల వాహనంలో మలయప్ప స్వామి


ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామి వారి సర్వ సైన్య అధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభి ముఖంగా వేంచేపు చేశారు. ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. ఇందులో ప్రథమంగా రూపాయి హారతి ఎంతో విశిష్టమైనది. తిరుమల పెద్ద జీయ్య‌ర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు.


వీటిలో నాలుగింటిని మూల మూర్తికి అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి శ్రీ మలయప్ప స్వామి వారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామి వారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామి వారిని ఆశీర్వదించారు. 


ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ రద్దు


ఆ తరువాత అర్చకులు తిరుమల పెద్ద జీయ్య‌ర్ స్వామి వారికి, చిన్న జీయ్య‌ర్ స్వామి వారికి, టీటీడీ తరఫున కార్యనిర్వహణ అధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచారు. ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరుమల పుర వీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఆణివార ఆస్థానం కార‌ణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. చాలా కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇదే రోజు ఆణివారి మహోత్సవం ఉండడంతో భక్తులు మలయప్ప స్వామి వారిని దర్శించుకొని సంబురపడుతున్నారు.