TTDevasthanams App: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ ను అప్ డేట్ చేసింది. ఇది వరకు ఉన్న "గోవింద" యాప్ నే టీటీ దేవస్థానమ్స్(TT Devasthanams) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. జియో ప్లాట్ ఫామ్ ద్వారా ఈ యాప్ ను అభివృద్ధి చేసినట్లే టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఎస్వీబీసీ భక్తి ఛానల్లో వచ్చే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపింది. దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లను భక్తులు నేరుగా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది.


యాప్ లో తిరుమల చరిత్ర స్వామి వారి కైంర్యాల వివరాలను పొందుపరిచినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే గోవింద యాప్ ను తమ మొబైళ్లలో కల్గి ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి "టీటీ దేవస్థానమ్స్"ను అప్ డేట్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. కొత్త వారు నేరుగా టీటీ దేవస్థానమ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని వివరించింది. 






అలాగే ఆనంద నిలయం బంగారు తాపడం పనులకు కొద్దిగా సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యాక పనులు మొదలు పెడతామని వివరించింది. రథసప్తమి సందర్భంగా వాహన సేవలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపింది. గ్యాలరీల్లో ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు, నీరు, పాలు, ఇచితంగా అందిస్తామని పేర్కొంది. 






నిన్న తిరుమల హుండీ ఆదాయం..


తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు అర్చకులు దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. బుధవారం రోజు 67,493 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,958 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.82 కోట్లు రూపాయలు ఆదాయం లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 03 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు‌ లేని భక్తులకు‌ స్వామి వారి సర్వదర్శనంకు 15 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది.