యువగళాన్నివినిపించేందుకు నారా లోకేష్ సిద్ధమయ్యారు. పసుపు దళాన్ని నడిపించేందుకు బయలుదేరారు. పార్టీ కార్యకర్తలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కుప్పుంలో కోలాహలంగా ప్రారంభమైంది. జనవరి 27 ఉదయం 11గంటలకు కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి యాత్ర మొదలైంది. ఇది ఓ రకంగా తెలుగుదేశం పార్టీ అధికారిక ఎన్నికల ప్రచార యాత్ర. తనను తాను నిరూపించుకునేందుకు నారా లోకేష్ తలపెట్టిన యాత్ర..! 400రోజులు.. 4వేల కిలోమీటర్ల జరిగే ఈ యాత్రకు తొలి అడుగు తండ్రి నియోకవర్గం కుప్పం నుంచి వేశారు లోకేష్. ఈ యాత్ర పూర్తైతే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నిర్వహించిన అతిపెద్ద రాజకీయ పాదయాత్రగా నిలుస్తుంది. 


అమ్మా-నాన్నలు.. అత్తమామలు ఇతర కుటుంబ సభ్యులు ఆశీస్సులు తీసుకుని... దేవాలయాలు, దర్గాలు, చర్చిలలో ప్రార్థనలు చేసి తండ్రి నియోజకవర్గానికి చేరుకున్నారు లోకేష్. రాజకీయాలకు సంబంధించి లోకేష్.. మొట్టమొదటి అడుగు పడింది కూడా కుప్పంలోనే . 2009లో తన తండ్రి తరపున లోకేష్ కుప్పుం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానంలో కీలకమైన అడుగు వేస్తున్నారు. పాదయాత్రకు అనుమతి వస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమైన వేళ.. షరతులతో కూడిన అనుమతి వచ్చింది. 400రోజులు జరిగే యాత్రకు ప్రస్తుతానికి 3 రోజులకు పర్మిషన్ లభించింది. 


400 రోజులు 125 నియోజకవర్గాలు 


4వేల కిలోమీటర్లు... 400 రోజులు జరిగే సుదీర్ఘ పాదయాత్రలో తొలిరోజు యాత్ర అంతా కుప్పం పట్టణంలోనే సాగుతోంది. ఓ పది కిలోమీటర్లు మాత్రమే యాత్ర చేసి కుప్పంలో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. చంద్రబాబు మినహా మిగిలిన నాయకులు ఈ సభకు హాజరవుతన్నారు. లోకేష్ మామ, పార్టీ నాయకుడు బాలకృష్ణతోపాటు.. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇతర లీడర్లు పాల్గొననున్నారు. ప్రతి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు సాగేలా యాత్ర సాగనుంది. మొత్తం 125 నియోజకవర్గాలను ఈ యాత్ర ద్వారా చుట్టి రానున్నారు.  


యువతే లక్ష్యంగా..


వచ్చే ఎన్నికల వరకూ సాగే ఈ యాత్ర ఎన్నికలనే టార్గెట్ చేసినప్పటికీ ఫోకస్ మాత్రం యూత్ పైన ఉండేలా చూసుకున్నారు. ఈ విషయంలో లోకేష్ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు అర్థమవుతోంది. 2019 ఎన్నికలకు ముందు యువతకు నిరుద్యోగ భృతి అందించడంలో లోకేష్ కృషి ఉంది. కేవలం ప్రతి నెలా పెన్షన్ అన్నట్లుగా కాకుండా దానికొక పోర్టల్ ను.. తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ ను కూడా అనుసంధానం చేశారు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో యువత ఓట్లను తెదేపా అంతగా పొందలేకపోయింది. ప్రత్యేక హోదా పోరాటాన్ని వైఎస్సార్సీపీ సాగించిన ప్రచారం కానీ.. యువనేతగా జగన్ మోహన రెడ్డి జనంలోకి చొచ్చుకుపోయిన విధానం వల్ల కానీ.. యువత ఓట్లను వైఎస్సార్సీపీ బాగానే పొందగలగింది. అయితే ఆ యువత కలలన్నీ వైసీపీ చెరిపేసిందని టీడీపీ భావిస్తోంది. హోదాపై ప్రజలను వైసీపీ నిలువునా మోసం చేసిందని.. కొత్త పరిశ్రమలు రాక.. ఉన్న భృతిని తీసేయడం వల్ల యూత్ చాలా అసంతృప్తితో రగిలిపోతున్నారని భావిస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం నుంచి యువకుడైన లోకేష్ యూత్ ను టార్గెట్ చేసేలా ఈ యాత్ర సాగిస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. యాత్రలో అన్ని అంశాలను ప్రస్తావించినా.. యాత్ర మాత్రం యువతే లక్ష్యంగా సాగనుంది. అందుకే యాత్రకు యువగళం అనే పేరునే ఖాయం చేశారు. ప్రతీచోట యువతను ఎక్కువ మందిని కలిసి వారి సమస్యలను వినడం.. వారితో గొంతు కలపడం అనే విధంగా యాత్రను డిజైన్ చేశారు. 


ఎమ్మెల్సీగా ఉన్నా.. మంత్రిగా పనిచేసినా కూడా రాజకీయంగా తాను వ్యక్తిగతంగా చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఈ పాదయాత్ర. ఇంతకు ముందు జరిగిన పాదయాత్రలు వాళ్లని సీఎం కుర్చీలో కూర్చొబెట్టాయి. ఉమ్మడి ఏపీ వైఎస్సార్ , చంద్రబాబు చేసిన యాత్రలు వారిని సీఎం కుర్చీలో కూర్చొబెట్టాయి. రాష్ట్రం విడిపోయాక జగన్ చేసిన పాదయాత్రనే ఆయన్ను అధికారంలోకి తెచ్చిందని పార్టీ భావిస్తుంటుంది. తెలంగాణలో కూడా అన్ని పార్టీల నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. కాబట్టి పాదయాత్ర, అందునా ఇంత పెద్ద యాత్రను ఏకబిగిన సాగించడం అన్నది కచ్చితంగా ప్రాధాన్యత కలిగిన విషయం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. 27 ఏళ్లుగా పార్టీకి అధ్యక్షుడు. 7 పదుల వయసు దాటాక కూడా ఇప్పటికీ ఫేస్ ఆఫ్ ది పార్టీ గా ఆయనే ఉంటున్నారు. చంద్రబాబు నుంచి తర్వాత తరం బాధ్యతలు తీసుకోవలసిన సమయం వచ్చింది. ప్రస్తుతానికైతే పార్టీలో లోకేష్ నాయకత్వానికి ఇబ్బంది లేదు. దానిపై బహిరంగంగా అసంతృప్తి కనబడటం లేదు. కానీ తనకు తాను.. పరిపూర్ణ నాయకుడు అని నిరూపించుకోవడానికి ఓ ఆమోదయోగ్యత అవసరం. మంత్రిగా పనిచేసినా నేరుగా ప్రజల నుంచి ఎన్నిక కాకపోవడం... కిందటి ఎన్నికల్లో ఓటమి ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి. దానికి జనామోదంతోనే జవాబివ్వాలని లోకేష్ భావిస్తున్నారు. 


అన్నీ తానై..
ఓ రకంగా ఇది లోకేష్ భావి నాయకుడు అని స్టాంప్ వేయడానికి జరుగుతన్న యాత్రనే అయినప్పటికీ .. పార్టీలో మాత్రం అంత పెద్ద హడావిడి అయితే లేదు. ఈ విషయంలో లోకేష్ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీకి సేవలందిస్తున్న ఓ కన్సల్టెన్సీ భాగం అయినప్పటికీ యాత్ర రూపకల్పన, రూట్ మ్యాప్ విషయంలో లోకేష్ శ్రద్ధ తీసుకున్నారు. బయలుదేరేముందు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు బహిరంగంగా లేఖ రాయడం.. యాత్రకు ముందు పార్టీలోని వారిని.. బయటవారిని నేరుగా కలవడం.. అందులోభాగమే. యాత్రకు సంబంధించి పార్టీ ముఖ్యనేతలకు కూడా సరైన సమాచారం లేదు. పైగా ఎలాంటి భారీ హంగామా లేకుండా చాలా సింపుల్ గా జరగాలని ఆయన కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలో ప్రజలతో నేరుగా మమేకం అయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
2019లో ఘోరమైన ఓటమితో డీలా పడ్డ తెలుగుదేశం.. అత్యంత బలంగా ఉన్న వైఎస్సార్సపీని మరోసారి ఢీకొట్టాల్సి ఉంది. ఈ ఎన్నికల యుద్ధంగా ఇదొక కీలక అడుగు. ఆ అడుగును కూడా ప్రత్యర్థి పార్టీ అత్యంత బలంగా ఉన్న రాయలసీమ నుంచి వేశారు లోకేష్. ఐదారేళ్లుగా తనపై వస్తున్న విమర్శలు.. హేళనలను తట్టుకుని రాటుదేలుతున్నారు. మరి ఈ యాత్ర ద్వారా తనకు, పార్టీకి ఏమాత్రం లాభం జరుగుతుందో చూడాలి.