Tirumala Ready For Ratha Saptami 2025: తిరుమలలో రథససప్తమి కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4న భారీగా భక్తులు తరలి వస్తారని అంచనాతో టీటీడీ ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. అన్నమయ్య భవన్‌లో సమీక్ష జరిగింది. ఉత్తర ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో టీటీడీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.  


సమన్వయ లోపం లేకుండా చర్యలు 


కేవలం వివిధ విభాగాల మధ్య సమన్వయం లోపంతో భక్తులు ప్రాణాలు పోయాయి. మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. ఇలాంటిది రిపీట్ కాకుండా ఉండేందుకు వచ్చే భక్తుల భద్రత, వారి సౌకర్యాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. టిటిడి వివిధ విభాగాల మధ్య సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు. 


ఏటా రథసప్తమి రోజున ఎంత మంది భక్తులు వస్తారనే లెక్కలు ఆధారంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్, పార్కింగ్, ఎమర్జెన్సీ టీమ్‌లు ఇలా ప్రతి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొండ కింది నుంచి భక్తులు వచ్చిన దర్శనం చేసుకొని తిరిగి వెళ్లే వరకు ఎవరికీ ఎలాంటి సమస్య లేకుండా ఉండేలా పర్యవేక్షించనున్నారు.


Also Read: మౌని అమావాస్య స్పెషల్ - మహా కుంభమేళా భక్తులకు కీలక సూచనలు


రథసప్తమి సందర్భంగా జరిగే వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు. అందుకే ఆ రోజు కూడా భారీగా భక్తులు తరలి వచ్చి స్వామి వారి సేవలో పాల్గొంటారు. అలాంటి వేడుకల కోసం సామాన్యులకే అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. రథసప్తమిని పురస్కరించుకుని 4న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే దర్శనం భాగ్యం కల్పించనుంది. ఎన్‌ఆర్‌ఐలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రివిలేజ్‌ దర్శనాలను కూడా రద్దు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేయబోమని ప్రకటించేసింది. టోకెన్లు లేని భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూలైన్‌ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది.


పటిష్ట భద్రత


రథసప్తమి భద్రతపై ఈ మధ్యే ఎస్పీ, పోలీసు అధికారులు పరిశీలన చేశారు. వాహన మండపము, నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, పార్కింగ్ ప్రదేశాలు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రాంతాల్లో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్‌టారు. భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ కంపార్ట్మెంటులను ఏర్పాటు చేయాలనే విషయంపై జాగ్రత్తలు తీసుకున్నారు. రద్దీని అంచనా వేస్తూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.  సూర్యజయంతి సందర్భంగా నిర్వహించే రథసప్తమి వేడుకల్ల ఉదయం ఐదున్నర గంటల నుంచి ఒకే రోజు ఏడు వానాల్లో స్వామివారు దర్శనం ఇస్తారు.    


పద్మావతి ఆలయంలో కోయల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం 


మరోవైపు రథ సప్తమిని పురస్కరించుకొని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. సుప్రభాతంతో ఉదయం అమ్మవారిని మేల్కొపి మూడు గంటల పాటు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి అన్నింటినీ శుద్ధి చేశారు. తర్వాత సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ప్రోక్షణం చేశారు.  అనంతరం భక్తుల దర్శనానికి అవకాశం కల్పించారు.  


Also Read: నేటి నుంచి వారం రోజులపాటు నాగోబా జాతర, మందు బాబులకు బ్యాడ్ న్యూస్