అనంతపురం: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులను పస్తులు ఉంచి ఇబ్బందులకు గురి చేస్తే.. మీరు కూడా పస్తులు ఉంటారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో గణతంత్ర దినోత్సవం రోజున విద్యార్థులు ఆకలితో అలమటించిన విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ప్రత్యక్ష్యంగా ఆకస్మిక తనిఖీ చేసి సంఘటనపై తీవ్రంగా స్పందించారు. బీసీ బాలుర, ఎస్సీ బాలికల వసతి గృహాల్ని పరిశీలించారు. మొత్తం వసతి గృహంలో ఉన్న సౌకర్యాలను, విద్యార్థులుండే ప్రతి గదిని పరిశీలించారు. టాయిలెట్స్, వంటశాలను కూడా చూశారు.


అనంతరం విద్యార్థులను అడిగి అన్ని అంశాలను తెలుసుకున్నారు. అలాగే స్థానికులతో కూడా సమావేశమై పలు అంశాలు తెలుసుకున్నారు. బీసీ వసతి గృహం వార్డెన్ నారాయణస్వామి హాస్టల్ కి  సరిగా రాడని.. పిల్లలకు వచ్చే బడ్జెట్ ను సరిగా ఖర్చు చేయడం లేదని ఎమ్మెల్యే పరిటాల సునీతకు వారు ఫిర్యాదులు చేశారు. తాగునీరు గొళ్లపల్లి నుంచి వస్తాయని.. స్నానానికి బాత్ రూమ్స్ సమస్య ఉందన్నారు. అలాగే టాయిలెట్స్ లేక నిచ్చెన వేసుకొని కాంపౌండ్ బయటకు వెళ్తామని విద్యార్థులన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. బీసీ వసతి గృహంలో ఆదివారం జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. వార్డెన్ పిల్లల్ని ఆకలితో ఉండేలా చేయడం సరి కాదన్నారు. ఇంత నిర్లక్ష్యం వహించిన వార్డెన్ పై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిపారు. ఒక విద్యార్థికి ఒక నెలకు 1400 ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వార్డెన్ సరుకులు కొనుగోలు చేసి మెను ప్రకారం టిఫిన్, భోజనం చేయించాలన్నారు. వార్డెన్ లేనప్పుడు మరొక వార్డెన్ ఇన్ ఛార్జిగా ఉండాలి.. లేదా పిల్లలకు ఎలాంటి సమస్య రాకుండా వంట వారితో సమన్వయం చేసుకోవాలన్నారు. అలా కాకుండా నారాయణ స్వామి నిర్లక్ష్యం వహించారన్నారు. వసతి గృహంలో భవనం కూడా దెబ్బతిందని చాలా చోట్ల మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చవుతుందని దీనిపై ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు విజ్ఞప్తి చేశామని... మరోసారి దీనిపై మాట్లాడి నిధులు వచ్చేలా చూస్తామన్నారు.




జిల్లా కలెక్టర్ తాత్కాలిక మరమ్మతులకు 10లక్షల వరకు మంజూరు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న టాయిలెట్స్, ఫ్యాన్ల మరమ్మతులను వెంటనే చేయిస్తామన్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి వసతి గృహంలో లైట్లు సరిగా పని చేయలేదని చూసి వెంటనే లైట్ల సమస్య పరిష్కారానికి కొత్త లైట్స్ తెప్పించాలని స్థానిక మండల కన్వీనర్ కు సూచించారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని.. ఖర్చు విషయంలో వెనుకాడటం లేదన్నారు.


తాజాగా చెన్నేకొత్తపల్లి ఎస్సీ బాలికల వసతి గృహం మరమ్మతులకు 33.80లక్షలు, ఎస్సీ బాలుర వసతి గృహానికి 32.40లక్షలు మంజూరు చేసినట్టు వివరించారు. వీటితో భవనాల మరమ్మతులు చేపడతామన్నారు. త్వరలో బీసీ వసతి గృహానికి నిధులు వస్తాయన్నారు. ప్రభుత్వం అందించాల్సినవన్నీ ఇస్తున్నా.. వార్డెన్లు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం సరికాదన్నారు. ఇక నుంచి ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు.